హైదరాబాద్,ఆగస్టు 3, (నమస్తే తెలంగాణ): జాతీయ స్థాయిలో తెలంగాణ ఫొటో జర్నలిస్టులు మరోసారి సత్తా చాటారు. కర్ణాటక మీడియా అకాడమీ ఆధ్వర్యంలో బెంగళూరులోని ప్రతిష్ఠాత్మక చిత్రకళా ఆర్ట్ గ్యాలరీ వేదికగా నిర్వహించిన ‘ఫోకస్ ఆన్ న్యూస్ 2.0 ఫొటో కాంటెస్ట్’ ఫలితాలను నిర్వహకులు సోమవారం ప్రకటించారు. ఈ పోటీల్లో ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక డిప్యూటీ చీఫ్ ఫొటో జర్నలిస్ట్ వీరగోని రజినీకాంత్ గౌడ్ తృతీయ బహుమతిని సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. ఈ ఫొటో పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 250 ఎంట్రీలు రాగా, కఠినమైన వడపోత తర్వాత కేవలం 50 ఫొటోలు మాత్రమే ఫైనల్స్‌కు ఎంపికయ్యాయి.
ఇందులో యావత్ తెలంగాణ రాష్ట్రం నుంచి కేవలం రెండే రెండు ఫొటోలు తుది జాబితాలో స్థానం దకించుకున్నాయి. ఫైనల్స్‌కు చేరిన 50 అత్యుత్తమ ఫొటోలలో కేవలం మూడింటికి మాత్రమే జ్యూరీ బహుమతులు ఖరారు చేసింది. ఇందులో మొదటి బహుమతి కేరళ రాష్ట్రానికి దకగా, రెండో బహుమతి ముంబై నగరానికి చెందిన ఫొటోగ్రాఫర్‌ను వరించింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ‘నమస్తే తెలంగాణ’ డిప్యూటీ చీఫ్ ఫొటో జర్నలిస్ట్ వీరగోని రజినీకాంత్ గౌడ్ మూడో బహుమతిని సొంతం చేసుకున్నారు. విజేతలకు బహుమతి ప్రదానోత్సవం బెంగళూరులోని చిత్రకళా పరిషత్ ఆర్ట్ గ్యాలరీలో జరగనుంది. మూడో బహుమతికి ఎంపికైన రజినీకాంత్ గౌడ్‌ను పలువురు అభినందించారు.
తెలంగాణ నుంచి ఎంపికైన రెండో ఫొటో కూడా నమస్తే తెలంగాణ ఫొటో గ్రాఫర్ తీసినదే కావడం విశేషం. మహబూబ్‌నగర్ జిల్లా ఫొటోగ్రాఫర్ బందిగె గోపి తీసిన ఫొటో చిత్రకళా ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనకు ఎంపికైనట్టు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో పలువురు బందిగె గోపిని అభినందించారు.