Namasthe Telangana | ‘మన పత్రిక.. మన ఆత్మగౌరవం’ అన్న నినాదంతో తెలంగాణ కోసం దాదాపు దశాబ్దమున్నరగా అక్షరకవాతు చేస్తున్నది నమస్తే తెలంగాణ. నాడు పరపాలనలోని దోపిడీని జనబాహుళ్యం ముందు ఎండగట్టింది. ఉద్యమానికి అక్షర కవచమై నిలిచింది. ఈ నేలకు గొంతుకనిచ్చింది. తెలంగాణ పునర్ నిర్మాణానికి పురుడుపోసి.. కుట్రల విచ్చుకత్తుల నుంచి నవజాత రాష్ర్టాన్ని పదేండ్లు కంటిరెప్పలా కాపాడుకున్నది. అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ.. అదే ప్రజల పక్షాన గళం విప్పుతున్నది కలం ఝుళిపిస్తున్నది నమస్తే తెలంగాణ. లగచర్ల నుంచి రామన్నపేట దాక.. మూసీ నుంచి దామగుండం దాక.. రైతన్న మొదలు నేతన్నల వరకు.. ఆటోవాలా నుంచి నిరుద్యోగ యువత వరకు.. సకలజనుల తరఫున నిలబడి, వారి ఆక్రందనను, ఆవేదనను, ఆగ్రహాన్ని ఎలుగెత్తి చాటుతున్నది నమస్తే తెలంగాణ.. నా డైనా నేడైనా తెలంగాణ కలం, గళం, బలం.. నమస్తే తెలంగాణ. దగాపడిన జనం కోసం రణం సాగిస్తున్న అక్షర దళం.. నమస్తే తెలంగాణ.

పాలన పగబడితే.. సామాన్యుడిపై కర్కశంగా ఎగబడితే.. ఎలా ఉంటుందో హైడ్రా బుల్డోజర్లు బస్తీలపై నిర్దయగా విరుచుకుపడిన ఉదంతాలే ఉదాహరణ. పట్నం గుండెల మీద భయకంపిత వాతావరణాన్ని సృష్టించిన సర్కారు ధ్వంసరచనను ప్రశ్నించింది నమస్తే తెలంగాణ. సున్నంచెరువు కావొచ్చు. నల్లచెరువు కావొచ్చు. హైదర్‌గూడ నలందనగరో, అమీన్పూర్ కిష్టారెడ్డిపేటో కావొచ్చు. గాజులరామారం, వట్టినాగులపల్లి.. పేరేదైనా కావొచ్చు. బాధితుల ఆక్రందనను, అధికారుల బాధ్యతారాహిత్యాన్ని నిలదీసింది. బస్తీలను చిదిమి, బడుగు గుడిసెలను కూల్చిన ఉదంతాలను ప్రముఖంగా ప్రచురించింది. సామాన్యుడి ఆక్రందనకు అక్షర రూపమిచ్చింది. పేదల కన్నీళ్లను పేజీల నిండా అలికింది.

బీసీలను వంచించింది కాంగ్రెస్. బీసీ డిక్లరేషన్ నుంచి డెడికేటెడ్ కమిషన్ దాకా.. అన్నిచోట్లా మాయమాటలతో మోసగించింది. కులగణన దగ్గరే అధికారపార్టీ అసలు డ్రామా అర్థం చేసుకున్న బీసీసంఘాలు ఏకతాటిపైకి వచ్చి పోరాటానికి దిగాయి. చివరికి 42శాతం కోటా పేరిట ప్రభుత్వం ఆటలాడింది. బీసీలకు తోడుగా నిలబడింది నమస్తే తెలంగాణ.

కాంగ్రెస్ నాటకాలను బట్టబయలు చేసింది. అసలు చేయాలన్న చిత్తశుద్ధే లేనప్పుడు.. అసెంబ్లీ తీర్మానం, ఢిల్లీ ధర్నా అంటూ సాగించిన మాయోపాయాలను ఎప్పటికప్పుడు పటాపంచలు చేసింది. రాజ్యాంగసవరణ ప్రస్తావన లేకుండా పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ఎండగట్టింది. చివరికి నమస్తే తెలంగాణ చెప్పిందే నిజమైంది. 42 శాతం కోటా లేకుండానే స్థానిక ఎన్నికలకు వెళ్లిందీ రేవంత్ ప్రభుత్వం.

ఏటా రెండు లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్.. చివరికి గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు పెట్టిన కొలువులకు.. నియామకపత్రాలు అందించి చేతులు దులుపుకొన్నది. అంతకుమించి నోటిఫికేషన్లు ఇచ్చిందీ లేదు. పోస్టులు భర్తీ చేసిందీ లేదు. డమ్మీ జాబ్క్యాలెండర్తో నిరుద్యోగులను దగా చేసింది. కాంగ్రెస్ మోసాన్ని త్వరగానే గుర్తించిన యువత సర్కారుపై యుద్ధభేరి మోగించింది. అది అశోక్‌నగర్ కావొచ్చు. సిటీ సెంట్రల్‌లైబ్రరీ కావొచ్చు. దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్ కావొచ్చు. ఉద్యోగార్థులు ఒక్కటై నిరసనలకు దిగారు. వారికి అండగా నిలిచింది నమస్తే తెలంగాణ. ఆవేదనకు అక్షరరూపమిచ్చింది. ఆగ్రహాన్ని పతాక శీర్షికలకెక్కించింది.

ముఖ్యమంత్రి రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఫార్మాక్లస్టర్ పేరిట రైతుల భూములను బలవంతంగా గుంజుకుంటే తిరగబడ్డయి గిరిజన కుటుంబాలు. లగచర్ల వారి ఆవేదనకు, ఆగ్రహానికి వేదికైంది. కాంగ్రెస్ నేతలు, దళారులు, అధికారులు అందరూ అమాయక రైతుల్ని ఎలా వంచించారో కండ్లకు కట్టింది నమస్తే తెలంగాణ. పోరాటానికి అండగా నిలుస్తూ.. వారి తరఫున అక్షరయుద్ధం చేసింది. కనబడిన ఆక్రోశం వెనుక.. కానరాని నిజానిజాలను వెలుగులోకి తెచ్చింది. గిరిజన మహిళలపై పోలీసుల దాష్టీకం, అర్ధరాత్రి దౌర్జన్యం, నిండుగర్భిణి జ్యోతి పోరాటాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది.

లగచర్ల అంశాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్లేందుకు దోహదపడింది. అంతటి ప్రజావ్యతిరేకత తర్వాత కూడా కాంగ్రెస్ సర్కారు మళ్లీ మళ్లీ వారి భూములను గుంజుకునేందుకు ప్రయత్నించడం, వ్యతిరేకించిన కుటుంబాలను కేసులుపెట్టి, వేధించి, చెల్లాచెదురు చేయడంపై వరుస కథనాలు ప్రచురించింది. అన్నింటికి మించి రైతులకు బేడీలు వేసి మరీ దవాఖానల చుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పడం వంటి ఫొటోలను బయటపెట్టింది నమస్తే తెలంగాణే! తొండలు గుడ్లు పెట్టని భూములంటూ.. ప్రభుత్వ పెద్దలు అసెంబ్లీలో అవహేళన చేస్తే.. క్షేత్ర పర్యటన చేసి, నిజాలను ప్రజలముందు పెట్టిందీ నమస్తే తెలంగాణే!

పదేండ్లపాటు సాగు బంగారమైన తెలంగాణలో.. కాంగ్రెస్ రాకతో అంతా తెర్లయ్యింది. సంక్షేమ పథకాలు అటకెక్కడంతో ఎవుసం భారమైంది. ఎరువులు, విత్తనాలు ఇచ్చేవారు లేరు. సాగునీళ్లు అందించినవారూ లేరు. పండిన పంటనూ కొనే దిక్కులేదు. పెట్టుబడి కూడా పుట్టనిస్థితిలో, దిగుబడి కూడా దక్కని పరిస్థితుల్లో అన్నదాతలు మళ్లీ ఆత్మహత్యలబాట పట్టారు. రెండేండ్లలో 730 మందికి పైగా రైతులు రాష్ట్రవ్యాప్తంగా బలవన్మరణాలకు పాల్పడ్డారు. నేలరాలిన మట్టిపూల లెక్కలను తీసి ఎప్పటికప్పుడు నమస్తేతెలంగాణ ప్రజలముందు ఉంచింది. గుడ్డి సర్కారు కదలకపోయినా.. తెలంగాణలో నెలకొన్న సాగుసంక్షోభాన్ని ప్రపంచానికి నిత్యం కథనాలతో తెలియజెప్పింది. ట్రిపుల్ఆర్ భూబాధితుల నుంచి రామన్నపేట సిమెంట్ పరిశ్రమ బాధితుల వరకు దగాపడిన రైతుల గోసను, గోడును అక్షరాల్లోకి దింపింది.

ఉచిత బస్సుతో మహిళలకు ఎంతవరకు లబ్ధి కలిగిందనే దానిపై ప్రభుత్వంలోనే ఇతమిథ్ధంగా లెక్కలేవీ లేవుగానీ, వేలాది ఆటోవాలాల కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ఉపాధి కోల్పోయి 160 మందికి పైగా ఆటోడ్రైవర్లు బలవన్మరణాలకు పాల్పడ్డారు. వారిని ఆదుకుంటామని నమ్మబలికిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదు. సర్కార్ వైఫల్యాన్ని నిరసిస్తూ.. ప్రజాభవన్ ముందు తన ఆటోకు నిప్పటించి ఓ డ్రైవర్ ఆందోళనకు దిగడం వారి మనోవేదనకు పరాకాష్ట. ఆటోకార్మికుల సమస్యలపై కలమెత్తింది నమస్తే తెలంగాణ. వరుస కథనాలను ప్రచురించింది. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాల వివరాలను రికార్డు చేసి, ప్రభుత్వం ముందు ఉంచింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంక క్రమక్రమంగా సిరిసిల్లలో పునరుజ్జీవం పొందిన చేనేత పరిశ్రమ.. రెండేండ్లలోనే ఆగమైంది. అటు బతుకమ్మ ఆర్డర్లు లేక, ఇటు ప్రభుత్వ చేయూత రాక వస్త్రపరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది. కార్మికులు మళ్లీ ఆత్మహత్యల బాట పట్టారు. కార్మిక కుటుంబాల ఆవేదనకు అక్షరరూపం ఇచ్చింది నమస్తే తెలంగాణ. చేనేత సంక్షోభానికి కారణమైన ప్రభుత్వ విధానాలను ప్రశ్నించింది నమస్తే తెలంగాణ.

అకస్మాత్తుగా ఓ రోజు ప్రభువులకేదో కలబడ్డదని.. పైనుంచి కిందిదాకా మూసీ ప్రక్షాళన చేపట్టేందుకు యంత్రాంగాన్ని రంగంలోకి దించింది. దానికి మూసీ వలన కలుగుతున్న కాలుష్యాన్ని, దాన్ని అందమైన నదిగా మారుస్తామని అరచేతిలో గ్రాఫిక్స్ చూపించింది. సియోల్‌లో చాంగ్యేచాన్ నదిని ఇట్లాగే మార్చేశారని వందిమాగధ మీడియాతో పుంఖానుపుంఖాలుగా కథనాలను వండివార్చింది. అంతవరకు బాగానే ఉన్నది కానీ, సర్కారు కన్ను పేదలపై పడింది. వందలాది బస్తీలను నేలమట్టం చేసేందుకు రాత్రికిరాత్రి నిర్ణయం తీసుకున్నది. దశాబ్దాలుగా అక్కడే ఇండ్లు కట్టుకుని నివసిస్తున్న వారితో కనీసం చర్చించకుండా, ప్రత్యామ్నాయం చూపకుండానే మార్కింగులు మొదలుపెట్టింది.
బస్తీజనం హతాశులయ్యారు. తమ బతుకుల జోలికి రావొద్దంటూ బతుకమ్మ పాటలుగట్టి పాడుకున్నారు. వారికి అండగా నిలిచింది నమస్తే తెలంగాణ. వేలాది కుటుంబాల గుండెకోతకు అక్షరూపమిచ్చింది. పేదల సంగతి తేల్చకుండా, వారికి ప్రత్యామ్నాయం చూపకుండా మూసీ ప్రాజెక్టు ఎందుకు చేపడుతున్నారని ప్రభుత్వాన్ని నిలదీయడమేకాదు.. దాని వెనుక దాగున్న రియల్ ఎస్టేట్ వ్యూహాలను వెల్లడించింది. ప్రపంచబ్యాంకు ముసుగేసుకుని సాగించిన డ్రామాలను, మెయిన్‌హార్ట్ అనబడే దివాలా కంపెనీని ముందుపెట్టి వేసిన పన్నాగాలను నమస్తే తెలంగాణ వరుస కథనాలతో వెల్లడించింది.