ఆ పోరాట పౌరుషం.. వరి పంటపై మమకారం ఇవే ఉమ్మడి నల్లగొండ రైతన్నలు బండిని అడ్డుకుని.. సెగపెట్టి పలాయనం చిత్తగించేలా చేశాయి! వరి ధాన్యం కొనుగోళ్లపై ఢిల్లీ బీజేపీ నేతలు ఒక రకంగా, గల్లీ బీజేపీ నేతలు మరో రకంగా మాటలతో మాయ చేస్తుండటంపై కడుపు మండిన అన్నదాతలు కన్నెర్ర చేశారు. యాసంగి ధాన్యం కొంటరా లేదా? అన్న ప్రశ్నకు జవాబు చెప్పని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై, ధాన్యం రాసులపై అరాచకం సృష్టించిన బండి బ్యాచ్‌పై మర్లవడ్డరు!
నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఎందుకీ తిరుగుబాటు? ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొనుగోలు కేంద్రాల దగ్గరకు వెళ్లినప్పు డు రైతులు కనీవినీ ఎరుగని విధంగా తిరగబడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఐకేపీ కేంద్రాల్లోకి సైతం అడుగుపెట్టనివ్వకుండా ఎందుకు మర్లబడాల్సి వచ్చింది? వరి తప్ప ఇతర పంటలకు అవకాశం లేని జిల్లా.. సమైక్య రాష్ట్రంలో నానా కష్టాలు పడ్డ రైతులు.. తెలంగాణ వచ్చిన నాటినుంచే మం చిరోజులు చూస్తున్నారు. సూర్యాపేటలో దశాబ్దాలుగా సాగుతున్న గోదావరి జలాల సాధన ఉద్య మం ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాకతో ఫలించింది.
డెడ్ స్టోరేజీలో కూడా సాగర్ చివరి ఆయకట్టు వర కూ నీళ్లిచ్చి రైతును నిలబెట్టిన ప్రభుత్వం.. రైతుబంధు, బీమా, ఎరువులు, విత్తనాలు వంటి వాటి తో భరోసా కల్పించిన ప్రభుత్వం.. వీటన్నింటి కారణంగా ఇప్పుడిప్పుడే నిలదొక్కుకొంటున్న నల్లగొండ రైతు.. ధాన్యం కొనేది లేదంటూ కేంద్ర ప్రభుత్వం వేసిన పిడుగుకు అదిరిపోయాడు. మరోవైపు వరి వేయండి.. అంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాటలతో గందరగోళానికి గురయ్యాడు. ప్రశాంతంగా ఉన్న మనసుల్లో సంక్షోభాన్ని రేకెత్తించి.. ఏమీ ఎరుగనట్టుగా బండి సంజయ్ తమ జిల్లాకే రావడాన్ని రైతులు తట్టుకోలేకపోయారు.
ధాన్యం కొనాల్సిన బాధ్యత నుంచి తప్పించుకొని.. మళ్లా యాసంగిలో వరి వేయాలం టూ రెచ్చగొడుతున్న సంజయ్‌పై మండిపడ్డారు. వానకాలం ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్న కేంద్రాలకు వచ్చి.. ధాన్యం కొంటలేరు.. ఇబ్బందుల్లో ఉన్నరంటూ పొడిపొడిగా మాట్లాడి వెళ్లిపోవడం రైతుల సహనానికి పరీక్షలా మారింది. అందుకే బండి యాత్రకు భంగపాటు తప్పలేదు.
గతంలో ప్రతి సీజన్లోనూ నాగార్జునసాగర్ నీటి వాటా కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగేది. ఎడమ కాల్వ కింద భూములను ఎండబెట్టి డెల్టాకు నీళ్లకు తరలించుకుపోతుంటే ఇక్కడ నెర్రె లు వారిన నేలలను చూసి రైతు గుండెలు రగిలిపోయేవి. నేడు నిక్కచ్చిగా నీటి వాటాను వినియోగిస్తుండటంతో రెండు పంటలకు సమృద్ధిగా సాగునీరు అందుతున్నది. తాజాగా కాళేశ్వరం నీళ్లు కూడా పారుతుండటంతో ప్రతీ ఎకరం సాగులోకి వచ్చింది. వాటికితోడు 4,160 చెరువులను మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించడంతో 1.18 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీటి వసతి తోడైంది. దీంతో వరి సాగు మూడు రెట్లు పెరిగింది. ఇక.. ప్రభుత్వ రైతు అనుకూల విధానాలు, రుణమాఫీ.. పెట్టుబడి సాయం, బీమా.. నీళ్లు, కరెంటు, ఎరువులు, విత్తనాలు.. ఇతర రాయితీలతో పడావు భూములన్నీ సాగులోకి వచ్చాయి.
ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నామని గుండెలమీద చెయ్యేసుకొని ఉన్న రైతు నెత్తిన కేంద్రం ధాన్యం కొనేది లేదన్న నిర్ణయం అశనిపాతంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ బండి.. కొనుగో లు కేంద్రాల పర్యటనకు నల్లగొండ జిల్లాను ఎంచుకోవడం వ్యూహాత్మక తప్పిదమేనన్న అభిప్రాయా లు వ్యక్తమవుతున్నాయి. అసలే ధాన్యం కొంటరో.. లేదో.. స్పష్టతనివ్వకుండా అయోమయాన్ని సృష్టి స్తూ.. వానకాలం కొనుగోళ్లు జరుగుతున్న కేంద్రా ల దగ్గరకు వచ్చి రాజకీయ నాటకమాడటాన్ని రైతులు సహించలేకపోయారు. ఫలితమే బండికి తగిలిన సెగ.
ఐదారేండ్ల నుంచి మార్కెట్లోనే వడ్లు అమ్ముకుంటున్నం. వానకాలం పంటను కేంద్రానికి తీసుకుపోయినం. 17% తేమ వస్తే ఒక రోజు అటు ఇటుగా ధాన్యం కొంటుండ్రు. యాసంగికి ధాన్యం కొనబోమని చెప్తే ఎలా? చెరువు కింద పొలంల వరి తప్ప ఏమీ పండదు. వేరే పంటలు వేసుకొనేటట్టు లేదు. ఈ కారుకు వదిలేస్తే భూమి అంతా జాలు పట్టుద్ది. – ఓర్సు మల్లమ్మ, రైతు, పానగల్లు, నల్లగొండ
కేసీఆర్ సారు వచ్చినంక మాకు ఫుల్లుగా నీళ్లిస్తుండు. సం తోషంగా ఎవుసం చేసుకుంటు న్నం. గీ ఏడేండ్ల నుంచి రానోళ్లు గిప్పుడొచ్చి మాకు ఆగం చేయాలని సూస్తున్నరు. రైతులకు న్యా యం చేసేది వదిలిపెట్టి అన్నం పెట్టే రైతులను మోసం చేద్దామని అనుకుంటే దేవుడు మెచ్చుతడా! వాళ్ల లాభం కోసం మాకు నష్టం చేస్తే అరిగోస పడుతరు. – ధరావత్ బాలు, భూక్యాతండా, తిరుమలగిరి మండలం, సూర్యాపేట జిల్లా
మా పొలాల్లో వరి తప్ప ఏం పండుతది? వాళ్లకు ఎవుసం గురించి ఏం తెలుస్తది? ఇప్పు డు ఎక్కడ చూసినా నీళ్లు ఉన్న యి. మంచిగా ఎవుసం చేసుకొ ని పంటలు పండించుకుంటు న్నం. మళ్లా ఇక్కడ పంటలు పండకుండా చేయాలని చూస్తున్నరు. ఏదైనా బాధపడి రైతుల వడ్లు కొనాలనే ఆలోచన చేయాలే గాని.. వరి వెయ్యొద్దు అంటే ఎట్లా? – భూక్యా సజ్జన్, మొండిచింతతండా, తిరుమలగిరి మండలం, సూర్యాపేట జిల్లా
కేసీఆర్ సారు రైతుల కోసం ఆలోచిస్తుంటే ఎప్పుడూ రాని బీజేపీ వాళ్లు పూట గడుపుకోవడానికి గ్రామాలకు వచ్చి అంతా కంప కంప చేస్తున్నరు. వరి కొనకుంటే మేం ఎటుపోవాల్నో వాళ్లే చెప్పాలె. యాసంగి ధాన్యం కొని తీరాల్సిందే. లేకుంటే మళ్ల ఓట్లు కానుతరా.. మా ఊర్లకెళ్లి వస్తారా.- గుడిసె సామేల్, ఫణిగిరి గ్రామం, నాగారం మండలం, సూర్యాపేట జిల్లా