నీలగిరి, మార్చి15 : నల్లగొండ పట్టణ సుందరీకరణలో భాగంగా ఇప్పటికే ప్రారంభించిన రోడ్ల విస్తరణ, సమీకృత మార్కెట్ నిర్మాణం తదితర పనులను జూన్ 2 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు ఆదేశించారు. టెండర్లు పూర్తయిన ఇతర పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితో కలిసి నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ కేవీ రమణాచారితో హైదరాబాద్‌లో మంగళవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ నల్లగొండ పట్టణంలో అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. ఇప్పటికే మూడు విడుతలుగా ఫేజ్-1కు రూ.30కోట్లు, ఫేజ్-2కు 46 కోట్లు, ఫేజ్-3కు 38 కోట్ల నిధులతోపాటు 5 కోట్లతో ఆర్‌ఆండ్‌బీ పనులు చేపట్టినట్లు తెలిపారు. వాటితోపాటు రూ.45 కోట్లతో చేపట్టిన ఎన్‌హెచ్ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. రోడ్ల విస్తరణలో ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ ముందుకెళ్లాలని సూచించారు. ఇప్పటికే ప్రత్యేకంగా వైకుంఠధామాన్ని మంజూరు చేసినందున వెంటనే పనులు ప్రారంభించాలని అన్నారు. పట్టణంలో జంక్షన్ల ఆధునీకరణ, అర్బన్ పార్క్, ఇతర పార్కులు, ఆర్చీలకు సంబంధించిన టెండర్లు పూర్తయినందున వెంటనే పనులను ప్రారంభించాలని ఆదేశించారు.
మున్సిపల్ కమిషనర్ కేవీ రమణాచారి పట్టణంలో జరగుతున్న అభివృద్ధి పనులు, ఇతర కార్యక్రమాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. ఉదయ సముద్రం ట్యాంక్‌బండ్ నమునాపై మంత్రి కేటీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. శిల్పారామం, కళాభారతి నమూనాలను రీడిజైన్ చేయాలని ఏజెన్సీలకు సూచించారు. అభివృద్ధి పనులకు సంబంధించి నిధుల విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడవద్దని, అవసరాలకు అనుగుణంగా పనుల ప్రగతిని బట్టి జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో సమీక్షిస్తూ నిధులు విడుదల చేస్తామని తెలిపారు. కళాభారతికి రూ.30కోట్లు, శిల్పారామానికి రూ.10 కోట్లు, పానగల్ ఉదయసముద్రం ట్యాంక్‌బండ్‌కు రూ.40 కోట్లు కేటాయించాలని మంత్రి కేటీఆర్‌ను కోరారు. సమావేశంలో ఈఎన్సీ శ్రీధర్, సీడీఎంఏ సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్ పాల్గొన్నారు.