నల్లగొండ, మార్చి 15 : నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయిన తర్వాత అనివార్య కారణాలతో ఏర్పడిన ఖాళీల భర్తీలో పారదర్శకత పాటించాలని జడ్పీ సంక్షేమ స్థాయీ సంఘం చైర్మన్ నారబోయిన స్వరూపారాణి అన్నారు. గురుకుల సీట్ల భర్తీలో జరిగే అవకతవకల నేపథ్యంలో జడ్పీ జనరల్ బాడీ తీర్మానం మేరకు ఏర్పడిన కమిటీతో రెండో రోజు జరిగిన సమావేశంలో ఆమె ఆర్సీఓలతో విచారణ నిర్వహించి మాట్లాడారు. బ్యాక్లాగ్ సీట్లు ఉంటే నోటిఫికేషన్ వేయకుండా, స్థానిక ప్రజాప్రతినిధులకు సంబంధం లేకుండా ఎందుకు భర్తీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకుల వ్యవస్థను ఎందుకు నీరుగారుస్తున్నారని ప్రశ్నించారు. ఇక నుంచి ప్రతి గురుకుల పాఠశాలలో ఎంపీపీలు, జడ్పీటీసీలు రెగ్యులర్‌గా తనిఖీ చేస్తారని, ఏ తరగతిలోనైనా ఖాళీలు ఏర్పడితే వెంటనే స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. అదేవిధంగా మెనూ సైతం పకడ్బందీగా అమలు చేయాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటి వరకు జరిగిన అవకతవకలపై జడ్పీకి నివేదిస్తామని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ సీఈఓ కాంతమ్మ, కమిటీ సభ్యులు మోసిన్ అలీ, నారబోయిన రవి, హౌసింగ్ పీడీ రాజ్‌కుమార్, ఆర్సీఓలు షకీనాబేగం, అరుణకుమారి, చంద్ర కళ, లక్ష్మయ్య పాల్గొన్నారు.