
నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రైతాంగం కోసం కేంద్రంపై టీఆర్ఎస్ సర్కారు ప్రత్యక్ష యుద్ధాన్ని ప్రకటించింది. ఇప్పటికే ఈ నెల 12న నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున రైతులతో ధర్నాను విజయవంతంగా చేపట్టింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల నేతృత్వంలో సాగిన ధర్నాలో పెద్దసంఖ్యలో ప్రజలు, రైతులు పాల్గొన్నారు. కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచేందుకు సీఎం కేసీఆర్ గురువారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చారు. ధర్నాలో ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున భాగస్వాములయ్యేందుకు సిద్ధమయ్యారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్, రైతుబంధు సమితి అధ్యక్షులు ధర్నాలో ముందువరుసలో నిలువనున్నారు.
సమయానికంటే ముందే వెళ్లేలా ..
ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మహాధర్నా కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్లేలా మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో ధర్నాపై చర్చించి తగిన సూచనలు చేశారు. జిల్లా నుంచి అత్యధిక ప్రాతినిథ్యం ఉండేలా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. ఈ మేరకు జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కూడా పెద్ద ఎత్తున తరలివెళ్లేందుకు ప్రజాప్రతినిధులు, నేతలు, ముఖ్యులు సిద్ధమయ్యారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 500-1000 మంది వరకు స్వచ్ఛందంగా తరలివెళ్లేలా ఎవరికి వారే ప్రణాళికలు రూపొందించుకున్నారు. హైదరాబాద్‌కు ఆనుకొని ఉన్న ప్రాంతాల నుంచి మరింత ఎక్కువ మంది వెళ్లనున్నారు.
బండిని నిలదీసిన ఉత్సాహంతో..
ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, రైతుబంధు సమితి సభ్యులు, పార్టీ మండల నాయకులు , ఇతర ముఖ్యులు, రైతు ప్రతినిధులు ఇలా ప్రాంతాల వారీగా నేరుగా ఇందిరాపార్కుకు చేరుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ధర్నా ప్రారంభానికి ముందే అక్కడికి చేరుకునేలా ఆదేశాలు ఇచ్చారు. రెండు రోజుల పాటు జిల్లాకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను వడ్ల కొనుగోలుపై కేంద్ర వైఖరి స్పష్టం చేయాలంటూ రైతాంగం నిలదీయడం చూస్తే కేంద్రం తమకు ఏ మేరకు అన్యాయం చేస్తున్నదనే విషయం రైతుల మదిలో బలంగా నాటుకుంది. సంజయ్‌ను నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఎక్కడికక్కడే రైతులతో కలిసి టీఆర్ఎస్ శ్రేణులు నిలదీస్తూ అడ్డగిస్తూ ఊపిరాడకుండా చేశారు. దీంతో ఆయన సమాధానం చెప్పలేక వెనుదిరగక తప్పలేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో తలపెట్టిన మహాధర్నాకు రెట్టించిన ఉత్సాహంతో కదిలేందుకు జిల్లా టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు సిద్ధమయ్యారు.
ధర్నాను విజయవంతం చేయాలి : గుత్తా
కేంద్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా, రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నేడు హైదరాబాద్‌లో జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ధర్నాకు జిల్లా నుంచి టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఒక ప్రకటనలో కోరారు. నిర్ణీత సమయానికి ధర్నా స్థలానికి చేరుకోవాలని సూచించారు. కేంద్రంపై జరిగే పోరాటంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పేర్కొన్నారు.
కేంద్రం దిగొచ్చే వరకూ పోరాటం
యాసంగి వడ్ల కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకూ పోరాటం కొనసాగుతుంది. స్వరాష్ట్రంలో అత్యధిక వరి సాగుతో మన రైతాంగం రికార్డు సృష్టించింది. కేంద్రం వైఖరితో ఉమ్మడి జిల్లాకు అతి పెద్ద నష్టం. అందుకే ఇక్కడి రైతులు కేంద్ర ప్రభుత్వ తీరుపై రగిలిపోతున్నారు. బండి సంజయ్‌పై తిరుగుబాటుతో అది మరింత స్పష్టమైంది. ఇన్నాళ్లూ సాగునీళ్లు లేక ఇబ్బందులు పడిన రైతులు స్వరాష్ట్రంలో పుష్కలమైన నీటితో వరి పండిస్తుంటే కేంద్రం మోకాలడ్డుతున్నది. అందుకే కేంద్ర ప్రభుత్వంపై జరిగే ప్రతి పోరాటంలోనూ ఉమ్మడి జిల్లా ప్రజల భాగస్వామ్యం పెద్దఎత్తున ఉంటుంది. మహాధర్నాకు కూడా పెద్ద సంఖ్యలో తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం. క్షేత్రస్థాయి నుంచి స్వచ్ఛందంగా ధర్నాలో పాల్గొనాలని రైతులు ఉత్సాహంగా ఉన్నారు. మహాధర్నాను సక్సెస్ చేయడంతోపాటు భవిష్యత్‌లోనూ కేసీఆర్ ఏ పిలుపునిచ్చినా ఆయన వెంట నడిచేందుకు ఉమ్మడి జిల్లా ఎప్పుడూ సిద్ధమే.