
‘పుచ్చ సాగులో ఆదాయం బాగున్నది. నీళ్ల అవసరం పెద్దగా ఉండదు. వారానికి ఒక్క తడి ఇస్తే చాలు.. ఎకరాకు 25వేల పెట్టుబడి అయితది. అంతకు రెండింతలు లాభం ఉంటది.. ఎట్లాంటి నష్టమూ ఉండదు.. మార్కెట్ అవసరమే లేదు.. ఎక్కడైనా అమ్ముకోవచ్చు. పోయినేడాది కరోనా వల్ల లోకల్లో అమ్ముకున్నా 70వేల ఆదాయం వచ్చింది.’
తిరుమలగిరి, నవంబర్ 17 : రైతులు నీరు పుష్కలంగా ఉంటే వరిసాగును ఎంచుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ వరినే పండించడంతో మార్కెట్లో డిమాండ్ ఉండడం లేదు. పైగా ఆరుగాలం పండించిన పంటను ‘అడ్డికి పావుశేరు’ లెక్కన అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొంత మంది రైతులు ఆరుతడి పంటలతో మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. కొద్దిపాటి పరిజ్ఞానం, రైతుల అనుభవాలు, వ్యవసాయాధికారుల సూచనలతో రంగంలోకి దిగి లాభాలు గడిస్తున్నారు. ఈ నేపథ్యంలో తుంగతుర్తి నియోజక వర్గంలో మూడేండ్లుగా పుచ్చసాగు పెరుగుతున్నది. యాసంగిలో రైతులు పుచ్చసాగు వైపు ఆసక్తి చూపుతున్నారు.
మార్కెట్కు అనుగుణంగా రైతుల ఆలోచనా విధానం మారాలి. మూస పద్ధతిలో వ్యవసాయం వల్ల నష్టాలు మూటగట్టుకోవాల్సిందే. పంట మార్పిడి చేయకుంటే పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతులు యాసంగిలో ఆరుతడి పంటగా పుచ్చ సాగు చేస్తే అధిక లాభాలు పొందే అవకాశం ఉన్నది. పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువగా ఉంటుంది. నీటిపారకంతో పుచ్చసాగు చేస్తే మంచి లాభాలు పొందవచ్చు.
నియోజకవర్గం వ్యాప్తంగా గతేడాది 40వేల ఎకరాల్లో పుచ్చసాగు చేశారు. ప్రస్తుతం 60వేల ఎకరాలకు పైగా సాగు చేసే అవకాశం ఉన్నదని వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తుంగతుర్తి మండలంలోని బండ్లరామారం, అన్నారం, గొట్టిపర్తి, రావులపల్లి ప్రాంతాల్లో పుచ్చసాగు చేస్తున్నారు. అదే విధంగా అర్వపల్లి, నాగారం మండలాల్లోని కొత్తపల్లి, కుంచమర్తి, ఉయ్యాలవాడ, వర్దమానుకోట, నాగారం, ఈటూరు, ఫణిగిరి, మామిడిపల్లి గ్రామాల్లో పుచ్చసాగు పెరిగింది. తిరుమలగిరి మండలంలో తొండ, వెలిశాల, జలాల్పురం, బండ్లపల్లి, మోత్కూర్, అడ్డగూడూరు మండలాల్లో చౌళ ్లరామారం, చిర్రగూడూరు, అడ్డగూడూరు. శాలిగౌరారం మండలంలో ఊట్కూరు, ఇటుకలపాడు తదితర ప్రాంతాల్లో పుచ్చసాగు చేస్తున్నారు.
ఆదాయం బాగుంది..
నేను మూడేండ్లుగా పుచ్చ సాగు చేస్తున్నాను. గతేడాది కరోనా వల్ల స్థానికంగా అమ్ముకున్నా 50వేల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ సారి కూడా పుచ్చసాగు చేయడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నా.. పుచ్చకాయలకు వేసవిలో మంచి డిమాండ్ ఉంటుంది. పెట్టుబడి ఎకరాకు 25 నుంచి 30 వేల రూపాయలు ఖర్చు వస్తుంది. పెట్టుబడి పోను 50 నుంచి 70 వేల వరకు లాభం ఉంటుంది. పంట దిగుబడి ఎకరాకు 50 నుంచి 60 క్వింటాళ్ల వరకు వస్తుంది. వారానికి ఒక తడి అందించినా సరిపోతుంది. ఒక్క కాయ 2 కిలోల నుంచి 8 కిలోల వరకు బరువు ఉంటుంది.
విత్తేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి…
వరితో పోల్చితే శ్రమ, పెట్టుబడి రెండూ తక్కువే. శ్రద్ధ పెడితే ఎకరాకు 50వేలు లాభం ఉంటుంది. పంట అమ్ముకునేందుకు ఇబ్బందులు కూడా ఉండవు. ఎక్కడైనా అమ్ముకోవచ్చు. విత్తనాలు విత్తేటప్పుడు జాగ్రత్తగా ఉంటే చాలు. పొలంలో అయితే 3 మీటర్ల ఎడం పాటించాలి. తేలిక పాటి భూమిలో 2.5 మీటర్లు ఎడంతో 60 సెం.మీటర్ల వెడల్పు కాల్వలను చేసి కాల్వకు ఇరువైపులా బోదెలు చేయాలి. బోదెలకు వెలుపలి వాలులో విత్తనాలు వేసుకోవాలి. డిసెంబర్, జనవరి నెలలో విత్తనాలు వేస్తే మూడు నెలల్లో పంట కోతకు వస్తుంది.