
మఠంపల్లి, నవంబర్ 17 : మహిళలు ఆర్థికంగా ఎదగడంతో పాటు వారి కుటుంబాలకు భరోసా కల్పించేలా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్స్ట్రక్షన్స్(న్యాక్) సంస్థ్ధ కృషి చేస్తున్నది. 18 నుంచి 40 ఏండ్ల మహిళలు, యువతులకు దుస్తులు కుట్టడంలో మూడు నెలలు శిక్షణ ఇవ్వడంతో పాటు ఆర్థ్ధికంగా ఎదుగుదలకు రూ.6 వేల విలువైన కుట్టు మిషన్, దర్జీకి అవసరమైన పరికరాలను అందజేస్తున్నది. జీవనోపాధికి ఉపయోగపడేలా రుమాళ్లు, చిన్న పరుపులు, మాస్కులు, కర్టెన్లు వంటివి కుట్టడంలోనూ శిక్షణ ఇస్తున్నారు.
ఒక్క బ్యాచ్లో 30 మంది..
ఒక్క బ్యాచ్లో 30 మందిని ఎంపిక చేసి ఏడాదికి నాలుగు విడుతలుగా 120 మందికి టైలరింగ్ సంబంధించి వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం మఠంపల్లిలో మొదటి బ్యాచ్ జూలైలో పూర్తయింది. రెండోబ్యాచ్ కూడా తర్ఫీదులో ఉన్నారు. ప్రతి 15 రోజులకోకసారి సామర్థ్య పరీక్షలు నిర్వహించి మూడు నెలల శిక్షణానంతరం అర్హత పత్రాలను అందిస్తున్నారు. ఈ గుర్తింపు సర్టిఫికెట్లు ప్రభుత్వం బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు కల్పించే రుణ సదుపాయం ఉద్యోగ అవకాశాల కల్పన ఉంటుందని న్యాక్ ప్రతినిధులు నిర్వాహకులు తెలిపారు.
శిక్షణ కేంద్రాలు..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి పొందేందుకు మొదటి బ్యాచ్ మార్చి, ఏప్రిల్లో న్యాక్ ఆధ్వర్యంలో మఠంపల్లి, హుజూర్నగర్, నల్లగొండ, నేరేడుచర్ల, సూర్యాపేట, మోతె, తుంగతుర్తి మండల కేంద్రాల్లో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండో బ్యాచ్ మఠంపల్లి, నల్లగొండ, మిర్యాలగూడెం, హుజూర్నగర్, తుంగతుర్తి కేంద్రాల్లో ప్రారంభించారు. ప్రతి కేంద్రంలో 30 మందిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ ఇచ్చేందుకు మహిళా ఇన్చార్జులను నియమించారు. ఉద యం 10 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు శిక్షణ కేంద్రాల్లో ఏకరూప దుస్తులు, మహిళలు, బాలికలు ధరించే అన్ని రకాల దుస్తులను కుట్టడంపై శిక్షణ ఇస్తున్నారు. ఏటా 480 మంది శిక్షణ పొంది ఉపాధి పొందనున్నారు.
దుస్తుల తయారీతో ఉపాధి అవకాశం
మాది మధ్య తరగతి కుటుంబం. శిక్షణ పూర్తికాగానే రెడీమేడ్ దుస్తులు కుట్టే కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసి కొంత మంది ఉపాధి కల్పించాలని అనుకుంటున్నా. తయారు చేసిన వస్ర్తాలను చిన్న, చిన్న వస్త్ర దుకాణాలకు సరఫరా చేయడం ద్వారా ఆదాయం పొందవచ్చు.
– రహీమా బేగం,మఠంపల్లి
విద్యార్హత అవసరం లేదు.
శిక్షణ పొందడానికి ఎలాంటి విద్యార్హత అవసరం లేదు. చద వడం,రాయడం వచ్చిన యువతులను ఎంపిక చేసి మూడు నెలలో దుస్తులను కుట్టడంలో శిక్షణ ఇస్తాం. మా దగ్గర శిక్షణ పొందిన మహిళలు ప్రభుత్వ పరంగా అర్హత సర్టిఫికెట్లు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో యూనిఫామ్ దుస్తులను కుట్టేం దుకు మొదటిగా శిక్షణ పొందిన మహిళలకు ప్రాధాన్యమిస్తారు. ఇక్కడ నేర్చుకున్న అల్లికలు, కుట్లపై స్వయంగా రికార్డుల్లో నమోదు చేస్తున్నాము.