
నల్లగొండ ప్రతినిధి, నవంబర్16(నమస్తే తెలంగాణ): ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మంగళవారం నల్లగొండ కలెక్టరేట్లోని తన ఛాంబర్లో విడుదల చేశారు. దీంతో మంగళవారం నుంచి నామినేషన్ల స్వీకరణ కూడా మొదలైంది. ఈ నెల 23 వరకు నామినేషన్లు స్వీకరించి 26న తుది జాబితా వెల్లడిస్తామని కలెక్టర్ ప్రకటించారు.
2015 డిసెంబర్లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆరేండ్ల గడువు త్వరలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. దానికి అనుగుణంగా మంగళవారం రిటర్నింగ్ అధికారి నోటిఫికేషన్ను విడుదల చేశారు. తొలిరోజు నామినేషన్లు దాఖలు కాలేదు. ఈ నెల 23వ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇందులో ప్రభుత్వ సెలవు దినాల్లో నామినేషన్ల స్వీకరణ ఉండదు. ప్రతి రోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే స్వీకరణ ఉంటుంది. ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఛాంబర్లోనే నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా అభ్యర్థ్ధులు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 24న నామినేషన్ల పరిశీలన 25, 26 తేదీల్లో ఉపసంహరణకు గడువు ఇచ్చారు. 26న మధ్యాహ్నం మూడు గంటల అనంతరం బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను వెల్లడించనున్నారు. డిసెంబర్ 10న పోలింగ్ జరుగనుంది. 14న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ ఎన్నికల్లో మొత్తం 1,271 మంది ఓటర్లు ఓటు హక్కును కలిగి ఉన్నారు. ప్రతి మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికలు బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహించనున్నారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు.
టీఆర్ఎస్కు గెలుపు ఏకపక్షమే..
ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఏకపక్ష విజయమే లభించనుంది. ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్న జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు 90 శాతం టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన వారే ఉన్నారు. పైగా ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉన్న 19 మందిలోనూ మెజార్టీ టీఆర్ఎస్కు చెందిన వారే. దీంతో ఈ ఎన్నికల్లో అభ్యర్థి ఎవరైనా సరే టీఆర్ఎస్ విజయం నల్లేరు మీద నడకే కానుంది. 2018 చివర్లో జరిగిన గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి తేరా చిన్నపరెడ్డి భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్ధిపై విజయం సాధించిన విషయం తెలిసిందే. తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏకపక్ష విజయాలు నమోదు చేసింది.