
నల్లగొండ ప్రతినిధి, నవంబర్16(నమస్తే తెలంగాణ) : జిల్లాలో సీనియర్ నేతగా ఉంటూ కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచి 2016లో టీఆర్ఎస్లో చేరిన గుత్తా సుఖేందర్‌రెడ్డికి మరోమారు శాసనమండలిలో ప్రాతినిధ్యం లభించనుంది. ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా జిల్లా నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డిని అధినేత కేసీఆర్ మరోమారు ఖరారు చేశారు. 2019లో జరిగిన సాధారణ ఎన్నికలకు దూరంగా ఉన్న సుఖేందర్‌రెడ్డికి పార్టీ అధినేత కేసీఆర్ ఆతర్వాత మండలిలో చోటు కల్పించారు. 2019 ఆగస్టు 26న తొలిసారిగా శాసనమండలి సభ్యునిగా సుఖేందర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటే ఆయనకు ఉన్న సీనియారిటీ నేపథ్యంలో అదే ఏడాది నవంబర్ 11న శాసనమండలి చైర్మన్‌గా కేసీఆర్ నియమించారు. దీంతో అప్పటి నుంచి ఈ ఏడాది జూలై 4వరకు ఆ పదవిలో సుఖేందర్‌రెడ్డి కొనసాగారు. అప్పుడే ఎన్నికలు జరుగాల్సి ఉండగా కరోనా విస్తృతి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేస్తూ వచ్చింది. ఈ నెలలో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేయగా మంగళవారంతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. ఇదే రోజు టీఆర్ఎస్ నుంచి ఆరుగురు అభ్యర్థులను కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. జిల్లా నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డికి మరోమారు అవకాశం రావడంతో ఆయన తన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలులో ఆయన వెంట మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, మోజంఖాన్ ఉన్నారు. శాసనసభలో టీఆర్ఎస్కు ఉన్న సంఖ్యాబలం నేపథ్యంలో ఆరుకు ఆరు స్థానాలు టీఆర్ఎస్కే రానుండగా గుత్తా ఎన్నిక కూడా లాంఛనమే కానుంది. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణల గడువు ముగిశాక వీరి ఎన్నిక ఏకగ్రీవమైనట్లుగా ప్రకటించనున్నారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి ఈ పదవిలో ఆరేండ్లపాటు కొనసాగనున్నారు.
వార్డు మెంబర్ నుంచి..
జిల్లాలో గుత్తా సుఖేందర్‌రెడ్డికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. గ్రామ స్థాయి నుంచి చట్టసభల్లో అత్యున్నత పదవుల వరకు ఆయన ఎదుగుతూ వచ్చారు. స్వగ్రామం చిట్యాల మండలం ఉరుమడ్లలో 1981లో గ్రామ పంచాయతీ వార్డు సభ్యునిగా ప్రస్థానం ప్రారంభించిన గుత్తా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. 1985లో చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్‌గా, 1992లో సింగిల్ విండో చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1992లో మదర్ డెయిరీ చైర్మన్‌గా ఎన్నికై 1995 నుంచి 1999 వరకు ఏపీ డెయిరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. 1995లో దేవరకొండ నుంచి జడ్పీటీసీ సభ్యునిగా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు. ఆ వెంటనే 1999లో టీడీపీ నుంచి అప్పటి మిర్యాలగూడ లోక్‌సభ స్థానంలో ఎంపీగా గెలుపొందారు. 2004లో టీడీపీ నుంచి నల్లగొండ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి 2009లో కాంగ్రెస్‌లో చేరి తిరిగి రెండోసారి ఎంపీగా గెలిచారు. 2014లోనూ మూడోసారి ఎంపీగా గెలిచారు. యూత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించినా 1983లో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో చేరి 2009 వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ క్రియాశీలక పాత్ర పోషించారు. 2016 జూన్‌లో ఎంపీగా ఉంటూనే టీఆర్ఎస్లో చేరారు. 2019 ఆగస్టులో ఎమ్మెల్సీగా, ఆ వెంటనే నవంబర్‌లో మండలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం రెండోసారి ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎన్నిక కానున్నారు.