ఏటా ఒకే రకమైన పంటలను సాగు చేయకుండా పంట మార్పిడి చేయాలని, అలా మార్చితేనే మంచి ఫలితాలను పొందవచ్చని గడ్డిపల్లి కేవీకే పంటల విభాగం శాస్త్రవేత్త దొంగరి నరేశ్ తెలిపారు. యాసంగిలో వరిధాన్యం అమ్ముకునేందుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నందున రైతులు ముందుచూపుతో ఇతర పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ఒకే పంటను వరుసగా సాగు చేయడం వలంల కలిగే అనర్థాలు, పంట మార్పిడి వల్ల కలిగే ఉపయోగాల గురించి ‘నమస్తే తెలంగాణ’
ఇంటర్వ్యూలో వివరించారు. ఆ వివరాలివీ..
నమస్తే : ఒకే రకమైన పంటను వరుసగా సాగు చేస్తే ఏమైనా అనర్థాలు ఉంటాయా ?
శాస్త్రవేత్త నరేశ్ : ఒక పంటను ఒకే పొలంలో వరుసగా పండించడం వల్ల చీడపీడల ఉధృతి అధికం కావడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి. రోగాలు కలిగించే పురుగు తన జీవిత చక్రం నిరాటంకంగా ముగించుకొని తీవ్రమైన హాని కలిగించే స్థితికి చేరుకుంటుంది.
నమస్తే : పంట మార్పిడి ఎందుకు చేయాలి ?
శాస్త్రవేత్త : ఒకే లోతు వేరు వ్యవస్థ కలిగిన పంటలను మార్పిడి చేయకుండా సాగు చేయడం వల్ల ఒకే లోతు పొరల నుంచి పోషకాలు తీసుకోవడంతో నేల నిస్సారమవుతుంది. నేల భౌతిక లక్షణాలు, స్వభావం దెబ్బతిన కుండా, చీడపీడల అభివృద్ధిని నిరోధించడానికి పంట మార్పిడి తప్పక చేయాలి
నమస్తే తెలంగాణ : పంట మార్పిడి వల్ల కలిగే ఉపయోగాలు ?
శాస్త్రవేత్త : పంట మార్పిడి చేసినప్పుడు రోగకారక పురుగు జీవిత చక్రం ఛేదించబడుతుంది. ఎందుకంటే ఒక పంటపై ఆశించే పురుగులు మరొక పంటపై ఆశించడం సాధారణంగా జరుగదు. అందుకే వేగంగా వృద్ధి చెందే కొన్ని రకాల పురుగులను అదుపులో పెట్టవచ్చు.
నమస్తే తెలంగాణ : పంట మార్పిడి చేసేటప్పుడు రైతులు ఎలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి ?
శాస్త్రవేత్త : పంట మార్పిడి చేసేటప్పుడు ఏదో ఒక రకమైన పంట సాగు చేయకుండా భూమి స్వభావం, వాతావరణం, రైతులు తమ అవసరాలు, మార్కెట్లో వాటికి ఉండే విలువ తదితర అంశాలను ఆధారంగా చేసుకుని పంటలను మారుస్తూ ఉండాలి.
నమస్తే తెలంగాణ : మన ప్రాంతంలో ఎటువంటి పంటలను వేసుకోవచ్చు?
శాస్త్రవేత్త : ఈ ప్రాంతంలో ఎక్కువగా నాగార్జునసాగర్ ఆయకట్టు ఉంటుంది కాబట్టి వానకాలంలో వరిని ఎక్కువగా పండిస్తారు. నీటి వసతిని బట్టి యాసంగిలో కూడా వరిని పండిస్తారు. అయితే పరిస్థితులు ఈ సారి వేరుగా ఉన్నాయి. అందుకే ప్రభుత్వం ఇప్పటికే యాసంగిలో వరికి బదులు ఇతర పంటలను సాగు చేయాలని ప్రకటించింది.
నమస్తే తెలంగాణ : వరికి ప్రత్యామ్నాయ పంటలుగా వేటిని సాగు చేసుకోవచ్చు ?
శాస్త్రవేత్త : సాధారణంగా పప్పు దినుసులు, నూనె గింజలు నాటుకోవచ్చు. అవసరాన్ని బట్టి పశుగ్రాసం కోసం గడ్డిజాతి పైర్లు, భూసారాన్ని పెంచడానికి పచ్చిరొట్ట పైర్లు వేసుకోవచ్చు.
నమస్తే తెలంగాణ : వరి తర్వాత మినుము, పెసర, వేరుశనగ సాగు చేయాలంటుంటారు
ఎందుకని ?
శాస్త్రవేత్త : వరి తర్వాత మినుము, పెసర, శనగ సాగు చేయడం వల్ల సుడిదోమ, టుంగ్రో వైరస్ను నివారించవచ్చు.
నమస్తే తెలంగాణ : వరి, చెరుకును మార్పిడి చేస్తూ పండించడం వలన కలిగే ప్రయోజనం?
శాస్త్రవేత్త : వరి తర్వాత చెరుకును వేయడం వల్ల దోమపోటు నివారించవచ్చు. చెరుకులో వేరు పురుగుకు అడ్డుకట్ట పడుతుంది.
నమస్తే తెలంగాణ : ఏ పంటలను సాగు చేస్తే ప్రత్యామ్నాయంగా ఏ పంటలు వేయాలి ? అలా చేయడం వల్ల ఉపయోగాలేమిటి ?
శాస్త్రవేత్త : పత్తి వేసిన పొలంలో జొన్న, మొక్కజొన్న, నువ్వులు, మినుము వేస్తే లద్దె పురుగు, పచ్చ పురుగులను నివారించవచ్చు. జొన్న, మొక్కజొన్న తర్వాత కందిని సాగు చేస్తే కాయతొలుచు పురుగు ఉధృతి తగ్గించుకోవచ్చు. వేరుశనగ తర్వాత పప్పుజాతులను సాగు చేస్తే ఆకుముడుతను అదుపులో పెట్టుకోవచ్చు.