సక్సెస్‌ను చూసిమరింతమంది ఇదే బాటలో..
వరి, పత్తి సాగుకు పేరుగాంచిన ఉమ్మడి నల్లగొండ జిల్లా కొంత కాలం నుంచి ప్రత్యామ్నాయ పంటలపైనా ఆసక్తి కనబరుస్తున్నది. తెలంగాణకు సైతం పరిచయం లేని పంటలను సాగు చేసి సక్సెస్ అవుతున్నది. దాదాపు లక్షా 70వేల ఎకరాల్లో వాణిజ్య, విదేశీ పంటలు వేసిన రైతాంగం.. వినూత్న ప్రయోగాలు, మెరుగైన ఫలితాలతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది. ధాన్యం సేకరణలో కేంద్రం కొర్రీల నేపథ్యంలో మరింతమందిని పూలు, పండ్లు, కూరగాయలు, సౌందర్యలేపన పంటల దిశగా ఆలోచింప జేస్తున్నది. ఇప్పటికే సాగు చేసిన రైతులు లాభాలు బాగున్నాయని చెప్తుండడంతో ప్రభుత్వం కూడా ఆయా పంటల సాగును ప్రోత్సహిస్తున్నది. ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. రైతులను చైతన్యం చేస్తూ వారి అభి ప్రాయాలతోనే ప్రత్యామ్నాయ పంటల సాగు విధానంపై జిల్లాల వారీగా వ్యవసాయ శాఖ నివేదికను రూపొందిస్తున్నది. దీనిపై త్వరలోనే మరింత స్పష్టత రానున్నది.
సూపర్ మచ్చీ..
నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో కొందరు చేపల పెంపకంపై ఆసక్తి కనబరుస్తున్నారు. మర్రిగూడ మండలం భీమనపల్లిలో ఓ రైతు ఏకంగా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్నే సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నాడు. ఇతర జిల్లాలకూ పిల్లలను ఎగుమతి చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగర్ ఆయకట్టు మినహా ప్రాంతాల్లో పెద్దగా సాగునీటి వసతులు లేవు. ఏటా 4నుంచి 5లక్షల ఎకరాల్లో వరి సాగైతే అదే గగనంగా ఉండేది. మిగతా భూముల్లో పత్తి, కంది, ఆముదం, సజ్జ, జొన్న పంటలు పండించేవారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం సాగునీటి ప్రాజెక్టులతో పాటు చెరువులు పునరుద్ధరణతో నీటి సౌకర్యం పెరిగింది. అత్యధికంగా 11.90లక్షల ఎకరాల్లో వరి సాగవుతున్న జిల్లాగా రికార్డు సాధించింది. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం వైఖరి రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. యాసంగిలో ధాన్యం కొనేది లేదని ఆంక్షలు విధించడంతో వరికి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించక తప్పేలా లేదు. దీర్ఘకాలికంగా లాభదాయక పంటల వైపు రైతులు మొగ్గు చూపాల్సిన సమయం ఆసన్నమైందని వ్యవసాయ నిపుణులు సైతం అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సాగర్ ఆయకట్టు మినహాయిస్తే ఇతర ప్రాంతాల్లో ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 1.70 లక్షల ఎకరాల్లో పండ్లు, పూలు, కూరగాయలు, ఇతర రకాల పంటల సాగువుతున్నట్లు అంచనా. ఇందులో వానకాలం, యాసంగి సీజన్లలో సాగు విస్తీర్ణంలో కొంత హెచ్చుతగ్గులు ఉంటాయని పేర్కొంటున్నారు. వానకాలంలో వరి, పత్తి సాగుకు మొగ్గు చూపిన రైతులు యాసంగిలో కూరగాయలు, పూలు, పప్పుదినుసులు సాగు చేస్తుంటారు. నల్లగొండ జిల్లాలో వానకాలంలో సుమారు లక్ష ఎకరాల్లో ఇతర అన్ని రకాల పంటలు సాగవుతున్నాయి. వీటిల్లో అగ్రో ఫారెస్ట్ మొక్కలు, బత్తాయి, నిమ్మ, కూరగాయలు, పూలు, పండ్ల తోటలు ఉన్నాయి. నల్లగొండ జిల్లా బత్తాయి సాగులో అగ్రస్థానంలో ఉన్నది. గతంతో పోలిస్తే తోటల విస్తీర్ణం తగ్గినా ప్రస్తుతం 43,672 ఎకరాల్లో ఉన్న తోటలపై రైతులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 9వేల ఎకరాల్లో సాగవుతున్న నిమ్మ రైతులు కూడా ఇదే రకమైన అభిప్రాయంతో సాగును కొనసాగిస్తున్నారు. ఇటీవల బత్తాయికి ప్రత్యామ్నాయంగా కినో ఆరెంజ్ సాగు విస్తరిస్తున్నది. ఎర్రచందనం, శ్రీగంధం చెట్ల పెంపకం కూడా పెరుగుతున్నది. అధికారికంగా 536 ఎకరాల్లో వీటి సాగు ఉన్నట్లు ఉద్యానవన అధికారులు చెబుతున్నా… అనధికారికంగా అంతకు మించి ఉంటుంది. వీటితో పాటు మలబారు వేప, యూకలిప్టస్, సర్వేగడ, మహాగని, సుబాబుల్ లాంటి చెట్లను కూడా రైతులు పెంచుతున్నారు. సుమారు రెండు వేల ఎకరాల్లో వీటిసాగు ఉన్నది. సూర్యాపేటలో 1,700 ఎకరాల్లో యాదాద్రి జిల్లాలో 800 ఎకరాల వరకు ఈ రకమైన చెట్లను సాగుచేస్తున్నారు.
ఇతర పంటలకూ అవకాశం..
జిల్లాలో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో కొంతమంది రైతులు వినూత్నంగా ఆలోచిస్తూ ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరిస్తున్నారు. ఇటీవల చేపల చెరువుల తవ్వకాలు సైతం పెరుగుతున్నాయి. వీటిల్లోనూ ముఖ్యంగా కొర్రమేను చేపల పెంపకంపై మక్కువ చూపుతున్నారు. మర్రిగూడ మండలం భీమనపల్లిలో ఓ రైతు ఏకంగా చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాన్నే సక్సెస్‌ఫుల్‌గా నిర్వహిస్తున్నాడు. ఇతర జిల్లాలకూ సీడ్ ఎగుమతి చేస్తున్నాడు. నల్లగొండ, కనగల్, నేరేడుచర్ల, పోచంపల్లి, మునగాల ఇలా.. ఆయా ప్రాంతాల్లోనూ రైతులు చేపల పెంపకంపై శ్రద్ధ చూపుతున్నారు. వానకాలంలో పూల సాగు కూడా బాగా విస్తరించింది. ముఖ్యంగా పండుగల సమయంలో బంతి, చామంతి, మల్లెలు, కనకాంబరాలకు మంచి డిమాండ్ ఉంటున్నది. రైతులే నేరుగా మార్కెట్‌కు తీసుకువచ్చి విక్రయించి మంచి ఆదాయాన్ని పొందారు. పాలీహౌస్ల్లోనూ డెకరేషన్ పూలను సాగుచేస్తున్నారు. మొత్తంగా చూస్తే వరికి బదులు ఇతర పంటల వైపు దృష్టిసారిస్తే ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశాలు అనేకం ఉన్నాయని పలువురు రైతుల అనుభవాలు కళ్లకు కడుతున్నాయి.
కూరగాయల సాగు వైపు…
హైదరాబాద్‌కు సమీపంలో ఉండడంతో జిల్లాలో కూరగాయల సాగు, మార్కెట్‌కు పరిస్థితులు ఎంతో అనువుగా ఉన్నాయి. దేవరకొండ ప్రాంతంలో దొండ తోటలు ప్రసిద్ధి చెందాయి. పందిర్లు వేసి సాగు చేస్తూ ఎగుమతి చేస్తున్నారు. అధికారికంగానే రెండు వేల ఎకరాల్లో దొండసాగు చేస్తున్నారు. మునగ తోటల సంఖ్య కూడా భారీగా పెరిగింది. బీర, కాకర, సొరకాయలు సైతం పండిస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ఇవి కాకుండా సీజన్‌లోగా పండే కూరగాయల వైపు రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కీరదోస, ఆకుకూరల సాగు ఇటీవల జిల్లాలో విస్తరించినట్లు లెక్కలు వెల్లడిస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలో ఈ వానకాలంలో 500 ఎకరాల్లో కూరగాయలు సాగుచేసినట్లు అధికారుల అంచనా. నల్లగొండ జిల్లాలో 2,500 మంది రైతులు 2,969 ఎకరాల్లో కూరగాయలు సాగుచేస్తున్నారు. యాదాద్రి జిల్లాలో వెయ్యి ఎకరాల్లో సాగు జరుగుతుంది. యాసంగిలో ఈ లెక్కలు రెట్టింపు సంఖ్యలో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. యాసంగిలో కూరగాయలకు మంచి ధరలు, వాతావరణం అనుకూలంగా ఉంటుందంటున్నారు.
విభిన్న పంటల సాగుపై దృష్టి…
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు మూడేళ్లుగా రైతులు విభిన్న పంటలు సాగు చేస్తున్నారు. ఆధునిక సాంకేతిక పద్ధతులను అనుసరిస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్, డేట్స్, అంజీర్, దానిమ్మ, ఆపిల్‌బేర్, తైవాన్ జామ, నేరేడు, జీడిమామిడి, సీతాఫలం, దానిమ్మ లాంటి విభిన్న పంటలు ఇప్పుడిప్పుడే జిల్లాలోని పలుచోట్ల సాగు మొదలైంది. ఇప్పటికే డ్రాగన్ ఫ్రూట్స్ మార్కెట్‌కు వస్తుండగా మంచి లాభాలు ఉన్నాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరి సాగుతో పోలిస్తే ఇతర పంట సాగే లాభదాయకమని, ఏండ్ల తరబడి ఆదాయం పొందవచ్చని ఉద్యానవన అధికారులు సూచిస్తున్నారు. ఇక ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నది. ఈ ఏడాదిలో ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో 1,500 ఎకరాల్లో టార్గెట్‌ను నిర్ణయిస్తే 2,400 ఎకరాల్లో నాటేందుకు రైతులు ముందుకు వచ్చారు. రానున్న నాలుగేండ్లల్లో సుమారు 40వేల ఎకరాల్లో విస్తరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉమ్మడి జిల్లాలో 1.22 లక్షల ఎకరాల భూమి ఆయిల్‌పామ్ సాగుకు అనువుగా ఉన్నట్లు అధికారులు అంచనా రూపొందించారు. యదాద్రి జిల్లాలో అత్యధికంగా మామిడి 12,143 ఎకరాల్లో సాగువుతుండగా బత్తాయి, దానిమ్మ కలిపి 1,750 ఎకరాల్లో సాగవుతున్నాయి. ఇటీవల జామ 443ఎకరాల్లో, సపోటా 134, సీతాఫలం 144, బొప్పాయి 123, డ్రాగన్ ఫ్రూట్ 13, ఇతర రకాలు 51 ఎకరాల్లో సాగు మొదలైంది. సూర్యాపేట జిల్లాలోనూ వివిధ రకాల పండ్ల తోటలు 17,435 ఎకరాల్లో సాగవుతున్నాయి.