
నల్లగొండ, డిసెంబర్ 4 : ఐకేపీ కేంద్రాల్లోనూ సన్నధాన్యం కొనుగోలు చేస్తున్నందున రైతులు అక్కడ విక్రయించి మద్దతు ధర పొందాలని జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి సూచించారు. సాగర్ ఆయకట్టు రైతులు యాసంగిలో వరి సాగు చేస్తున్నందున సన్నాలు ఏమేరకు సాగు చేస్తున్నారో అధికారులు అంచనాలు రూపొందించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు సభ దృష్టికి తీసుకురాగా.. అందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని జడ్పీ చైర్మన్ ఆదేశించారు. మిల్లర్లను సమన్వయం చేసుకుని కొనుగోళ్లలో ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. జిల్లాలో 6లక్షల మెట్రిక్ టన్నుల సామర్త్యం కలిగిన మిల్లులు ఉన్నాయని, జిల్లాలో పండిన ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులూ ఉండబోవని అధికారులు వివరించారు. గురుకుల ఆర్సీఓలు సమావేశాలకు రావడం లేదంటూ స్థాయీ సంఘం చైర్పర్సన్ నారబోయిన స్వరూపారాణి చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయమై చైర్మన్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలల ఉద్దేశాలను నీరుగారిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సమావేశాలకు రాకుండా ప్రిన్సిపాళ్లను ఎందుకు పంపిస్తున్నారని ఆర్సీఓలపై మండిపడ్డారు.
అధికారుల పని తీరుపై సభ్యుల ఆగ్రహం..
జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో పేరుకుపోయిన సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చిన జడ్పీటీసీలు, ఎంపీపీలు అధికారుల పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కట్టంగూర్‌లో స్కూల్ భవనం ఎప్పుడో పూర్తయినా బిల్లులు ఇవ్వడం లేదని జడ్పీటీసీ సభ దృష్టికి తీసుకువచ్చారు. సెలవులు వృథా అవుతాయన్న ఉద్దేశంతో ఉపాధ్యాయులు డిసెంబర్లో మూకుమ్మడిగా సెలవులు పెట్టడంతో పిల్లలు ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా శనివారం ఒక్కరోజే 1-7 స్థాయీ సంఘాలపై చర్చ జరిగింది. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, కంకణాల ప్రమీల, సీఈఓ వీర బ్రహ్మచారి, డీప్యూటీ సీఈఓ కాంతమ్మ పాల్గొన్నారు.