ఇంద్రవెల్లి, జనవరి 31: అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్లో గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా జాతర ప్రారంభమైంది. సోమవారం అర్ధరాత్రి మెస్రం వంశీయులు నిర్వహించిన మహాపూజలతో మొదలైన జాతర ఫిబ్రవరి 6 వరకు కొనసాగనున్నది. పురాతన నాగోబా విగ్రహంతో వచ్చిన మెస్రం వంశీయుల పటేళ్లకు సంప్రదాయ వాయిద్యాలతో స్వాగతం పలికారు. నాగోబా దేవత, సతీదేవత, బాన్దేవతలకు పూజలు చేశారు. మట్టి కుండలను 22 కితలకు చెందిన మెస్రం మహిళలకు అందజేశారు. కొనేరు నుంచి కుండలతో నీటిని తీసుకొచ్చారు. మహిళలకు గోవాడ్లో ప్రవేశం కల్పించారు. మహాపూజలకు ఆరగంట ముందు ఆలయాన్ని గంగాజలంతో శుద్ధిచేశారు. మెస్రం వంశీయుల మహాపూజల అనంతరం వచ్చిన అతిథులతోపాటు ఇతరులు కూడా నాగోబాకు పూజలు చేసేందుకు అవకాశం కల్పించారు. మహాపూజలకు తరలివచ్చిన మెస్రం వంశీయులు, భక్తజనంతో ఆలయం కిక్కిరిసిపోయింది.