రీసెంట్గా ఓ హిందీ ఛానల్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో బాలీవుడ్ నుంచి బోనీ కపూర్, సౌతిండియా నుంచి హీరో సిద్ధార్థ్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ పాల్గొన్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ల మధ్య జరిగిన సరదాగా సాగిన చర్చ వల్ల ప్రశాంతంగా సాగుతున్న ఈ చిట్‌చాట్ కాస్తా.. సౌత్ సినిమా వర్సెస్ బాలీవుడ్ అన్నట్టు తయారైంది. డిస్కషన్లో భాగంగా ‘తెలుగు సినిమాలకు యూఎస్‌లో మంచి మార్కెట్ ఉంది. తమిళ సినిమాలకు సింగపూర్, మలేషియాల్లో మార్కెట్ ఉంది..’ అన్నారు బోనీ కపూర్. ఇంతలో నాగవంశీ కలుగజేసుకొని ‘వినడానికి హార్ష్‌గా ఉన్నా మీరొక్క విషయాన్ని ఒప్పుకొని తీరాలి. మీ బాలీవుడ్ వాళ్లు సినిమాలు చూసే తీరును మేం పూర్తిగా మార్చేశాం. మీరు బాంద్రా, జుహు దగ్గరే స్టక్ అయిపోయారు.
కానీ మేం బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, కల్కి, యానిమల్ లాంటి సినిమాలు తీశాం.’ అన్నారు. నాగవంశీ స్టేట్మెంట్కు ఏకీభవించని బోనీకపూర్.. ‘అలాంటి సినిమాలు మేం ఎప్పుడో చేశాం.’ అని ఏదో చెప్పబోయేలోపు.. ‘మీరు కూడా ఇంతకుముందు ‘మొగల్ ఏ అజమ్’ తర్వాత బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలనే ప్రస్తావించారు. ఒక్క హిందీ సినిమా గురించి కూడా మాట్లాడలేదు. నిజానిక్కూడా గత మూడ్నాలుగేళ్లలో మాస్ సినిమాలు, ఈవెంట్ సినిమాలతో భారతీయ సినిమాను మేము సమూలంగా మార్చేశాం’ అంటూ కౌంటర్ ఇచ్చారు నాగవంశీ. వెంటనే.. బోనీ ‘నువ్వు గదర్ 2, పఠాన్, జవాన్ చిత్రాలను మరిచిపోతున్నావ్?!’ అనగానే.. ‘జవాన్’ తీసింది మా సౌత్ డైరెక్టర్ అన్న సంగతి మీరు మర్చిపోతున్నారు. ‘పుష్ప2’ హిందీలో ఇప్పటికి 86కోట్లు వసూలు చేసింది. దాంతో ప్రస్తుతం మీ ముంబై వాళ్లకు నిద్ర పట్టడంలేదు’ అంటూ రీ కౌంటర్ ఇచ్చారు నాగవంశీ. ఈ చర్చ ఆరోగ్యకరమైన వాతావరణంలో సరదాగా సాగిందని, సీరియస్‌గా తీసుకోవద్దని నాగవంశీ ట్విట్టర్లో పేర్కొన్నారు.