SL vs AFG : ఆసియా కప్ చివరి లీగ్ మ్యాచ్‌లో అఫ్గనిస్థాన్ ఆదిలో తడబడినా ఆఖర్లో భారీ స్కోర్ చేసింది. శ్రీలంక పేసర్ నువాన్ తుషార(4-18) విజృంభణతో పవర్ ప్లేలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయిన కాబూలీ టీమ్ మొహమ్మద్ నబీ(60) ఇబ్రహీ జద్రాన్(24) ఇన్నింగ్స్‌తో కోలుకుంది. వంద లోపే కుప్పకూలేలా కనిపించిన జట్టుకు కెప్టెన్ రషీద్ ఖాన్ (24) అండతో నబీ కొండంత స్కోర్ అందించాడు. తనదైన పవర్ హిట్టింగ్తో రెచ్చిపోయిన రషీద్ ఔటయ్యాక.. గేర్ మార్చిన నబీ 20వ ఓవర్లో చెలరేగిపోయాడు. వెల్లలాగేకు చుక్కలు చూపిస్తూ వరుసగా 5 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో.. అఫ్గన్ జట్టు లంకకు కష్టసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గనిస్థాన్‌కు ఆశించిన ఆరంభం లభించ లేదు. దూకుడుగా ఆడుతున్న ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్(14)ను మూడో ఓవర్లోనే తుషారా ఔట్ చేసి షాకిచ్చాడు. ఆ కాసేపటికే కరీం జన్నత్(1), సూపర్ ఫామ్‌లో ఉన్న అటల్(18)ను సైతం క్లీన్‌బౌల్డ్ చేసిన తుషార అఫ్గన్‌పై ఒత్తిడి పెంచాడు. అంతే.. పవర్ ప్లేలో 43కే మూడు వికెట్లు పడడంతో ఇబ్రహీం జద్రాన్(24) జట్టును గట్టెక్కించే ఇన్నింగ్స్ ఆడాడు. లంక స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొన్న జద్రాన్.. రసూలీ (9), అజ్మతుల్లా(6)తో కీలక పరుగులు జోడించాడు. అయితే.. వెల్లలాగే ఓవర్లో చమీర చేతికి క్యాచ్ ఇచ్చి అతడు వెనుదిరిగడంతో అఫ్గన్ జట్టు వందలోపే చాపచుట్టేలా కనిపించింది.
Mohammad Nabi = a gift that keeps giving 🤌 pic.twitter.com/jcP7xxBkKq
— ESPNcricinfo (@ESPNcricinfo) September 18, 2025
కానీ.. కెప్టెన్ రషీద్ ఖాన్(24), మాజీ సారథి మహమ్మద్ నబీ(60) అండగా లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. షనక వేసిన 15వ ఓవర్లో వరుసగా 4, 6 బాదిన రషీద్ జట్టు స్కోర్ వంద దాటించాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు విలువైన 35 రన్స్ చేశారు. రషీద్ ఔటయ్యాక లంక బౌలర్ల భరతం పట్టిన నబీ ఆఖరి ఓవర్లో 32 రన్స్ రాబట్టాడు. వెల్లలగే బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ వరుసగా 5 సిక్సర్లు బాదాడు. దాంతో, అఫ్గనిస్థాన్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.