‘బంగార్రాజు’ చిత్ర ప్రచార కార్యక్రమాలు జోరందుకుంటున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌తో పాటు ‘లడ్డుండా..’ అనే పాటకు మంచి స్పందన లభించింది. అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. రమ్యకృష్ణ, కృతిశెట్టి కథానాయికలు. తాజాగా ఈ సినిమా నుంచి రెండో సింగిల్ ‘నాకోసం’ ఆదివారం విడుదలైంది. ‘కొత్తగా నాకేమయ్యిందో వింతగా ఏదో మొదలయ్యిందో అంతగా నాకర్థం కాలేదే..మెరుపులా నీచూపేమందో..చినుకులా నాపై వాలిందో..’ అంటూ సాగిన ఈ గీతానికి అనూప్‌రూబెన్స్ స్వరాల్ని అందించారు. సిధ్‌శ్రీరామ్ ఆలపించారు. ‘నాగచైతన్య, కృతిశెట్టిల మధ్య వచ్చే ప్రణయగీతమిది. చక్కటి మెలోడీగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం మైసూర్లో సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. నాగచైతన్య, ఫరియాఅబ్దుల్లాపై ప్రత్యేక గీతాన్ని తెరకెక్కిస్తున్నాం’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: యువరాజ్, సంగీతం: అనూప్‌రూబెన్స్, నిర్మాణ సంస్థలు: జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్, స్క్రీన్‌ప్లే: సత్యానంద్, నిర్మాత: అక్కినేని నాగార్జున, కథ, దర్శకత్వం: కల్యాణ్‌కృష్ణ.