కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మా ఇంట్లో వంట చేసేందుకు అయ్యగార్లు, అమ్మగార్లూ వస్తుండేవారు. అప్పుడప్పుడూ కూనూరు నుంచి అండమ్మగారూ, లక్ష్మయ్యగారూ వచ్చేవారు. చాలాసార్లు కలిసి, కొన్నిసార్లు విడివిడిగా వచ్చి మా ఇంట్లో కొన్నాళ్లు ఉండి వెళ్లేవాళ్లు.
ఏదో పనిమీద వచ్చినా.. మా ఇంటికి వచ్చాక అమ్మగారు, అయ్యగారు ఓ నెల రోజులైనా ఉండేవారు. ఇద్దరి మధ్యా భీకర మాటల యుద్ధాలు నడిచేవి. తరువాత అయ్యగారు మా ఇంట్లో వంటకు ఉపక్రమిస్తే.. అమ్మగారు మా అత్తయ్య వాళ్లింటికి వెళ్లి వంట మొదలుపెట్టేది. ఇద్దరికిద్దరూ ఆ పంచాయితీ ఎఫెక్ట్ వంటమీద పడకుండా మహారుచిగా వంట చేసేవాళ్లు. అండమ్మగారు ఎప్పుడూ ఒక మాటనేది. “వంట బాగుంటె.. బాగున్నదని మెచ్చేటోళ్లు తక్కువగానీ, ఏదన్న ఒక్కటి కుదురకుంటే తొట్లెల ఉన్న చంటిపిల్ల గూడ బాగలేదంటది!” అని! ప్రతి దీపావళికి లక్ష్మయ్యగారు ఒక్కరే మా ఇంటికి వచ్చి నాలుగైదు రోజులు ఉండేవాడు. నరక చతుర్దశి రోజు తెల్లవారుజామునే మా ఇంటినుంచి తయారై.. వ్యాపారస్తుల ఇళ్లకు వెళ్లి ఆశీర్వచనం చేసి, సంభావనలు తెచ్చుకునేవాడు. ఇక ఆరోజు మా అమ్మ వండిన వంటే తినేవాడు. మర్నాడు దీపావళి రోజున లక్ష్మీ పూజలకు వెళ్లి, అన్ని దుకాణాలకూ తిరిగి డబ్బులు సంపాదించేవాడు. అలా దాదాపు పది పన్నెండేళ్లు వచ్చాడనుకుంటా. మా ఊరు అప్పటికే టౌన్ కనుక ఆయనకు బాగానే గిట్టుబాటయ్యేది.
అండమ్మగారు ఏదైనా ఫంక్షను కోసమైనా, పండుగలప్పుడైనా, ఊరికే వచ్చినా.. ఓ పట్టాన పోయేది కాదు. ముఖ్యంగా ఫంక్షన్లప్పుడు వంటకు మొదట మాట్లాడుకున్న మూడు నాలుగు రోజులైపోయినా.. “ఇంగ మా ఊరికి పోత!” అని ఆవిడ అనేది కాదు. “మరి ఎప్పుడు పోతవమ్మా!” అని వీళ్లూ అడిగేవారు కారు.
ఈలోగా మేము ఏది కొనుక్కోవాలని బజారుకు వెళ్లినా.. “నాగ్గూడ తెండమ్మా.. పైసలిస్త!” అనేది. అలా గాజులు, దువ్వెన, అద్దం, తిలకం, కాటుక, పక్కపిన్నులు, పిన్నీసులు.. ఇలా ఏవి కొనుక్కొచ్చినా.. “నా వంట పైసలు ఇయ్యంగనె మీకిస్త!” అనేది. ఇక అమృతాంజనం, జిందా తిలిస్మాత్, కొబ్బరినూనె, బట్టల సబ్బు, ఒంటి సబ్బు, పోకవక్కలు, పళ్లపొడి.. ఇలాంటివన్నీ ఇంట్లో ఉన్న సామాన్లే వాడేది. నాన్న డబ్బివ్వగానే.. “అయిదు రోజులు ఎక్వ ఒండిన గాదమ్మ! ఇంకిన్ని పైసలు ఇయ్యరాదుండి” అనేది అమ్మతో. నాన్నెందుకో మిగతా విషయాల్లో కరుణామయుడే గానీ, ఈ విషయంలో మటుకు.. “మాట్లాడుకున్న దగ్గరికి ఇచ్చినం గద! తెల్లారే ఎళ్లిపోనుండే మరి. తనిష్టం కొద్దీ ఉన్నది.. ఇప్పుడు అదనంగ పైసలు అడుగుడు ఏంది?!” అనేవాడు అమ్మతో. మధ్యలో అమ్మ ఎటూ చెప్పలేక తన దగ్గరున్న డబ్బు ఇచ్చేది. ఆమెనేమో బస్ చార్జీలు, ఇంకా అదనపు చార్జీలు కూడా రాబట్టేది. తన వయసు చాలా తక్కువని అండమ్మగారి అభిప్రాయం. ఎప్పుడూ ఆ విషయంగా మా మేనత్తలతో వాదిస్తూ ఉండేది. వినీవినీ ఓసారి మా చిన్నాన్న.. “సరే లేవమ్మా! నువ్వు మీ చిన్నబిడ్డ శ్రీదేవి కంటే కూడా చిన్నదానివి. సరేనా?!” అన్నాడు. ఆమె చురచురా చూసి మళ్లీ నవ్వేసింది.
అండమ్మగారు వచ్చేటప్పుడు తేలికగా ఉన్న చేతి సంచీ కాస్తా.. వెళ్లేటప్పుడు బరువుగా, పొట్ట పగిలేటట్టు తయారయ్యేది. అదనంగా ఇంకో సంచీ కూడా పుట్టుకొచ్చేది. చాలాసార్లు ఆమె ఇంటినుంచి బయల్దేరి వెళ్లి రెండు నిమిషాలకే మళ్లీ వచ్చేసేది. “ఏందోనమ్మా! నేను పోత అనేవరకే అన్ని అయితయి. గీ మూలమలుపు తిరిగేవరకే పిల్లి ఎదురైంది” అనో.. “కట్టెలమోపు ఎత్తుకొని మనిషి ఎదురైండు, దరిద్రపు శకునం. ఎట్ల పోదు?!” అనో.. “అబ్బ! గిక్కడిదాక పోంగనె ఒంటి బ్రాహ్మడు ఎదురైండు. కాళ్లు కడుక్కొని పోతనని ఒచ్చిన” అనో చెప్పేది. ఆ రోజుకి ఇక ప్రయాణం రద్దు అన్నమాటే!
కొన్నిసార్లు బస్స్టాండ్ దాకా పోయి ఓ గంటాగి మళ్లీ వచ్చేది. “పోయినట్టుంది పాపం!” అని అమ్మ అనగానే.. “ఆఁ.. ఏం బోదు! చూస్తుండు మెల్లెగ వొస్తది!” అనేది నానమ్మ. ఈలోగానే ఓ గంట సేపటికి భారంగా నడుస్తూ అండమ్మగారు రానే వచ్చేది. “ఎంతసేపు జూసినా దాని బొంద మీది బస్సు.. రానే లేదు. చూసీచూసీ దప్పి గాబట్టె! యాష్ట పుట్టింది. చీకటి గాబట్టె! మళ్ల అక్కడ దిగినాక వాగుల నడిచి పోవాల్నాయె! తిప్పలైతదని ఒచ్చిన” అనేది. లేకపోతే.. “నా పాడె! గీ సంచీ మోసుకుంటు, తనుసుకుంటు నేను పొయ్యేవరకే.. బస్సు..” అనేది. కాసేపు కాగానే.. “ఇగ బియ్యం పొయ్యండి. ఏం కూరలు ఒండమంటరు?!” అని వంటకు సిద్ధపడేది. అలా వచ్చినావిడ మళ్లీ వారంపాటు ప్రయాణం మాటెత్తితే ఒట్టు. కూతుర్లందరి పెళ్లిళ్లు చేశాక ఆమె వాళ్లుండే చోటుకు వెళ్లిపోయింది. అయ్యగారు ముందే చనిపోయాడు. ఆమె చనిపోయాక కూడా కొన్నాళ్ల తరువాత తెలిసి చాలాబాధ కలిగింది. వాళ్ల కొడుకు అప్పుడప్పుడూ వచ్చిపోతుండేవాడు. ఆ తరువాత అతని జాడకూడా లేదు.
ఇప్పుడు వంటవాళ్లు రోజుకింతని చాలా ఎక్కువగా.. వేల రూపాయలు డిమాండ్ చేస్తుంటేనో, ఒప్పుకొన్న రోజులు తప్ప.. ఒక్కరోజు ఎక్కువ ఉండుమని బతిమిలాడినా కూడా ఆగకుండా వెళ్లిపోతుంటేనో, ఏమాత్రం రుచిగా వండకపోతేనో.. అమ్మ ఎప్పుడూ అండమ్మగారిని తల్చుకుంటూ ఉంటుంది. “పాపం! ఏం జేస్తది!? బీదరికం, బహు సంతానం.. ఎట్లనో అట్ల మనదగ్గర రోజులు గడుపుకొనేది. ఇప్పుడుంటెనా?! పోనియ్యక మనింట్లనే ఉంచుకుందును!” అంటుంది.