సిటీబ్యూరో/బొల్లారం,నవంబర్ 29(నమస్తే తెలంగాణ): పట్టపగలు కత్తులతో బెదిరించి మూత్తూట్ ఫైనాన్స్‌ను దోచుకోవాలనే ప్రయత్నాన్ని సకాలంలో స్పందించిన పోలీసులు, పౌరులు భగ్నం చేశారు. ప్రజలు వెంటాది దోపిడీ దొంగల ముఠాలోని ముగ్గురిని పోలీసులకు పట్టించారు. సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో తిరుమలగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. ఎల్ఐసీ బిల్డింగ్‌లో ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం ఉంది. సోమవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కార్యాలయాన్ని సిబ్బంది తెరువగా, ఇద్దరు వ్యక్తులు వచ్చారు. తమ వద్ద బంగారం ఉందని, దానిని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవాలంటూ సిబ్బందిని నమ్మించారు. కొద్ది క్షణాల్లోనే అక్కడ పనిచేస్తున్న మహిళా ఉద్యోగి మెడపై కత్తి పెట్టి బెదిరించారు.
వెంటనే అప్రమత్తమైన ఇతర ఉద్యోగులు షేక్నజీమా, శశికళ అలారం మోగించారు. ఆ శబ్దానికి దొంగలు పరారయ్యారు. నిమిషాల వ్యవధిలోనే అలారం శబ్దం విని స్థానికులు అక్కడకు చేరుకున్నారు. చౌరస్తాలో విధి నిర్వహణలో ఉన్న తిరుమలగిరి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రవికుమార్, కానిస్టేబుల్ మహేశ్‌గౌడ్, సురేశ్ ఏదో జరిగిందని గుర్తించారు. పరారవుతున్న ఇద్దరు దొంగలను స్థానికులు చుట్టుముట్టడంతో ట్రాఫిక్ కానిస్టేబుళ్లు అదుపులోకి తీసుకున్నారు. ఇంతలోనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. దోపిడీకి యత్నించిన మహారాష్ట్ర అయోధ్యనగర్ కు చెందిన లక్ష్మణ్, బాలకృష్ణ, అశోక్‌లను అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న కత్తులను స్వాధీనం చేసుకున్నారు.
రెండేండ్ల కిందట రామచంద్రాపురం ముత్తూట్ ఫైనాన్స్‌ను మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన దోపిడీ ముఠా ఉదయం 9 గంటల ప్రాంతంలో దాడి చేసి 43 కిలోల బంగారాన్ని అపహరించారు. ఈ ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. అలాగే తాజాగా సోమవారం కూడా తిరుమలగిరి ముత్తూట్ ఫైనాన్స్‌ను దోచుకునేందుకు మహారాష్ట్ర నుంచి సోమవారం తెల్లవారుజామున హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్‌లో నగరానికి చేరుకున్నారు. సిటీలో తెలిసిన వారి వద్దకు వచ్చి బైక్‌ను తీసుకున్నారు. ఉదయం ముత్తూట్ ఫైనాన్స్ వద్దకు చేరుకొని ఇద్దరు వ్యక్తులు కార్యాలయంలోకి వెళ్లగా, మరో వ్యక్తి కింద ఉండి వచ్చిపోయే వారిని గమనిస్తూ..దోపిడీకి ప్రయత్నించాడు. అలారం మోగించడం, స్థానిక ప్రజలు వెంటనే స్పందించి దొంగలను వెంటాడి పట్టుకోవడంలో పోలీసులకు సహకరించడం, డయల్ 100కు ఫోన్ చేయడంతో నిందితులను పారిపోకుండా పట్టుకోగలిగారు. మరో దొంగ కూడా వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అతడు పరారయ్యాడు. కేసు దర్యాప్తు చేపట్టారు.