దేశంలో ప్రగతిశీల సాహిత్యోద్యమం మొదటి ప్రపంచ యుద్ధానంతర కాలంలో ప్రారంభమైందని రికార్డులు ధృవీకరిస్తున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధానంతరం రష్యాలో లెనిన్ నాయకత్వంలో బోల్షివిక్ విప్లవం విజయవంతమై సోవియట్ యూనియన్ ఏర్పడటంతో ప్రపంచంలో పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద దేశాలు, ఫాసిస్ట్ రాజ్యాలతో పాటూ సోషలిస్ట్ శిబిరం కూడా తన ప్రభావాన్ని చూపడం ప్రారంభమైంది.
ప్రపంచ మార్కెట్లపై ప్రాబల్యం కోసం యూరప్ సామ్రాజ్యవాద దేశాల మధ్య పోటీ తీవ్రతరమైంది. అప్పటికే ప్రపంచంలో అనేక ఖండాల్లో వలసలను ఏర్పాటు చేసుకున్న ఇంగ్లాండ్, ఫ్రాన్స్, పోర్చుగీస్, స్పెయిన్, జర్మనీ, ఇటలీ దేశాల మధ్య పోటీ తీవ్రమై ఆయా దేశాల్లో పరస్పరం యుద్ధాలకు దిగడం, దాని ప్రభావాలు యూరప్‌లో ప్రసరించడంతో
అది 1940వ దశకం నాటికి 2వ ప్రపంచ యుద్ధానికి భూమికను ఏర్పరిచాయి.
మరోవైపు సోవియట్ యూనియన్ సోషలిస్టు విధానాలు ప్రపంచవ్యాప్తంగా వలస వ్యతిరేక, సామ్రాజ్యవాద ఉద్యమాలకు చోదకశక్తిగా మారాయి. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో స్వాతంత్య్రోద్యమాలు తీవ్రమైనాయి. ఒకవైపు స్వదేశీ స్వాతంత్య్రోద్యమాలు, రెండవ వైపు సామ్రాజ్యవాద దేశాల మధ్య పరస్పర ఘర్షణలు.. ఇవన్నీ ప్రపంచ వ్యాప్తంగా మేధావులను, బుద్ధిజీవులను ప్రేరేపించాయి. సోషలిస్ట్ విధానాల ఆలోచనాధారతో సాహిత్య రచనలు చేయడం ప్రారంభమైంది. అప్పటివరకు భావ కవిత్వంలో, ప్రేమ కవిత్వంలో ఈదులాడుతున్న కవులు రచయితలు వామపక్ష, అభ్యుదయ భావజాలంతో రచనలు చేయడం ప్రారంభించారు.
యూరప్ దేశాల్లో ముఖ్యంగా ఇంగ్లాండ్‌లో నివసిస్తున్న భారతదేశ రచయితలు, బుద్ధిజీవులకు ఇంగ్లిష్, ఇతర యూరోపియన్ సాహిత్యంలో వస్తున్న అభ్యుదయ సాహిత్యాన్ని అధ్యయనం చేసే అవకాశం లభించింది. అక్కడి ఆధునిక రచనా ప్రక్రియలను ఆకళింపు చేసుకున్నారు. రచనలు చేయడం ప్రారంభించారు.
దేశంలో ఉధృతమవుతున్న జాతీయోద్యమం, రెండవ వైపు విస్తరిస్తున్న సోషలిస్ట్ భావజాలంతో ప్రభావితమై దేశ ప్రజల పేదరికాన్ని, ఆర్థిక దోపిడీని, కడగండ్లను చిత్రీకరిస్తూ కవిత్వం, కథలు, నవలలు రాయడం ప్రారంభించారు. 1930 దశకం నాటికి ప్రగతిశీల సాహిత్యకారులు ఒక రచయితల సంఘాన్ని ఏర్పాటుచేసి సమన్వయంతో రచనలు చేయడం వల్ల ప్రజలను వలస వ్యతిరేక జాతీయోద్యమాల్లోకి, సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాల్లోకి సమీకరించవచ్చునని భావించారు. 1935లో సజ్జాద్ జహీర్ చొరవతో లండన్‌లో భారతీయ ప్రగతిశీల రచయితల సంఘాన్ని (The Indian Progressive Writers Association) కొందరు రచయితలు కలిసి ఏర్పాటుచేశారు.
1936 జూలైలో కలకత్తాలో కూడా అభ్యుదయ రచయితల సంఘం ఏర్పాటైంది. సయ్యద్ సజ్జాద్ జహీర్, ప్రొఫెసర్ అహ్మద్ అలీ నాయకత్వంలో అఖిల భారత ప్రగతిశీల రచయితల సంఘం 1936 ఏప్రిల్‌లో లక్నోలో ఏర్పాటైంది. ఆ తర్వాత హమీద్ అఖ్తర్, ఫైజ్ అహ్మద్ ఫైజ్, అహ్మద్ నదీం ఖాసీం, సాదత్ హసన్ మంటో, ఇస్మత్ చుగ్తాయ్, డాక్టర్ రషీద్ జహాన్ వంటి రచయితలు సంఘంలో చేరారు. వారందరూ అప్పటికే ఉర్దూలో పేరుగాంచిన కవులు, రచయితలు.
సజ్జాద్ జహీర్ నాయకత్వంలో ప్రగతిశీల రచయితల సంఘానికి 1935లోనే ఒక ప్రణాళికను తయారు చేశారు. ఈ ప్రణాళికా రచనలో సజ్జాద్ జహీర్‌తో పాటూ మొహమ్మద్ దిన్ తసీర్, ముల్క్‌రాజ్ ఆనంద్, జోషి పర్సాద్, ప్రమోద్ రంజన్ సేన్ గుప్త, జ్యోతి ఘోష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రణాళికను తొలిసారిగా 1935 మున్షి ప్రేంచంద్ తను నిర్వహిస్తున్న పత్రిక ‘హంస’లో హిందీలో ప్రచురించారు. ప్రణాళిక ఇంగ్లిష్ అనువాదం ఫిబ్రవరి 1936లో Left Review పత్రికలో అచ్చయింది.
ఈ ప్రణాళికను ఏప్రిల్ 10న లక్నోలో ప్రముఖ హిందీ, ఉర్దూ రచయిత మున్షీ ప్రేంచంద్ అధ్యక్షతన జరిగిన ప్రగతిశీల రచయితల సంఘం తొలి మహాసభలో ఆమోదించుకున్నారు. సంఘం పేరును ఉర్దూలో అంజుమన్ తరక్ఖి పసంద్ ముసన్నిఫిన్ అని నామకరణం చేశారు. హిందీలో ‘అఖిల్ భారతీయ్ ప్రగతిశీల్ లేఖక్ సంఘ్’ అని నామకరణం చేశారు. లక్నోలో జరిగిన మొదటి కాన్ఫరెన్స్‌లో ప్రగతిశీల రచయితలతో పాటు సోషలిస్టు నాయకులు జయప్రకాష్ నారాయణ్, యూసుఫ్ మెహ్రలీ, ఇందులాల్ యాగ్నిక్, కమలాదేవి ఛటోపాధ్యాయ, మియా ఇఫ్తెకారుద్దీన్లు కూడా పాల్గొన్నారు. జవహర్లాల్ నెహ్రూ, సరోజినీనాయుడు మహాసభకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. తొలి మహాసభలో పాల్గొన్న తెలుగు రచయిత అబ్బూరి వరద రాజేశ్వరరావు తండ్రి అబ్బూరి రామకృష్ణారావు ఒక్కరే అని సామల సదాశివ ఒక ఇంటర్వ్యులో పేర్కొన్నారు. ఉర్దూ రచయిత సజ్జాద్ జహీర్‌ను సంఘానికి ప్రధాన కార్యదర్శిగా మహాసభ ఎన్నుకున్నది. అఖిల భారత ప్రగతిశీల రచయితల సంఘం 2వ మహాసభ 1938లో కలకత్తాలో జరిగింది. మహాసభలో ప్రముఖ బెంగాలీ రచయిత, నోబెల్ పురస్కార గ్రహీత అయిన రబీంద్రనాథ్ టాగోర్ ప్రారంభోపన్యాసం ఇవ్వాల్సి ఉండగా ఆయన అనారోగ్యం కారణంగా స్వయంగా హాజరు కాలేకపోయారు. అయితే, ఆయన తన ఉపన్యాసాన్ని మహాసభకు సమర్పించారు.
అంజుమన్ తరక్ఖి పసంద్ ముసన్నిఫిన్లో ప్రముఖ పాత్ర పోషించింది ఉర్దూ రచయితలే. మున్షీ ప్రేంచంద్, కిషన్ చందర్ లాంటి కొందరు హిందువులైన ఉర్దూ, హిందీ రచయితలు సంఘంలో ప్రముఖులుగా ఉన్నప్పటికీ అత్యధికంగా సభ్యులుగా చేరింది ముస్లిం రచయితలే.
సజ్జాద్ జహీర్‌తో పాటు అబ్దుల్ హఖ్, చిరాగ్ హసన్ హస్రత్, అబ్దుల్ మజీద్ సాలిక్, మౌలానా హస్రత్ మొహాని, జోష్ మలిహాబాదీ, ప్రొఫెసర్ అహ్మద్ అలీ, డాక్టర్ అఖ్తర్ హుసేన్ రాయ్పురి, ఫైజ్ అహ్మద్ ఫైజ్, ఇస్మత్ చుగ్తాయ్, కురతుల్ ఇన్ హైదర్, ప్రొఫెసర్ మంజున్ గోరఖ్‌పురి, డాక్టర్ రషీద్ జహాన్, సాహిబ్జాదా మహమూద్ ఉజ్ జఫర్, ప్రొఫెసర్ మంజూర్ హుసేన్, అబ్దుల్ అలీం.. ఇట్లా అనేక మంది ముస్లిం రచయితలు, కవులు క్రియాశీలకంగా పాల్గొని దేశంలో ప్రగతిశీల సాహిత్యోద్యమాన్ని సమున్నతంగా నిలబెట్టారు. ఉర్దూ రచయితల చొరవతో ఏర్పాటైన అంజుమన్ తరక్ఖి పసంద్ ముసన్నిఫిన్ ప్రభావంతో దేశంలోని అన్నిభాషల రచయితలూ తమ తమ రాష్ర్టాలలో ప్రగతిశీల రచయితల సంఘాలను అవే లక్ష్యాలను, ప్రణాళికను ప్రకటించుకొని ఏర్పాటుచేసుకున్నారు.
తెలుగు రచయితలు కూడా అభ్యుదయ రచయితల సంఘాన్ని ఏర్పాటుచేశారు. ఫలితంగా తెలుగులో రచయితలు ప్రగతిశీల సాహిత్యం రాయడం ప్రారంభించారని, చాసో, పురిపండా అప్పలస్వామి, ఉప్పల లక్ష్మణరావు, శ్రీశ్రీ, రావిశాస్త్రి, కొడవటిగంటి కుటుంబరావు, కాళీపట్నం రామారావు.. ఇట్లా ఉత్తరాంధ్రలో అభ్యుదయ సాహిత్యోద్యమం ఊపందుకున్నదని, భావ కవిత్వానికి దీటుగా నిలబడిందని సదాశివ ఇంతకుముందు పేర్కొన్న ఇంటర్వ్యూలో యాది చేసుకున్నారు. వీరంతా సోషలిస్టు భావజాలంతో బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని నిరసిస్తూ జాతీయోద్యమానికి మద్దతుగా తమ రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. ఫ్యూడల్ దోపిడీని నిరసిస్తూ దున్నేవానికే భూమి నినాదాన్ని ఎత్తుకున్నారు. సోషలిస్ట్ ఆర్థికవ్యవస్థ మాత్రమే ఈ దేశంలో పేదరికాన్ని, ఆర్థిక దోపిడీని రూపుమాపుతుందని నమ్మి రచనలు చేశారు.
స్వాతంత్య్రానంతరం ప్రగతిశీల సాహిత్యోద్యమాన్ని కిషన్ చందర్, ఇస్మత్ చుగ్తాయ్, సాదత్ హాసన్ మంటో, సిబ్తే హసన్, అలీ సర్దార్ జాఫ్రీ, సాహిర్ లూధ్యాన్వి, కైఫీ ఆజ్మీ, మఖ్దూం మొహియుద్దీన్, కేఏ అబ్బాస్, రాజిందర్ సింగ్ బేడీ, అమ్రితా ప్రీతం, జావేద్ అఖ్తర్, గుల్జార్ తదితరులు ముందుకు నడిపించారు. వీరే ఇండియన్ పీపుల్స్ థియేటర్‌ను కూడా ఏర్పాటుచేసి దేశంలో ప్రగతిశీల సాంస్కృతికోద్యమానికి పునాదులు వేశారు. సజ్జాద్ జహీర్ ప్రగతిశీల సాహిత్యోద్యమ చరిత్రను ‘రోష్నాయ్’ శీర్షికతో వెలువరించిన పుస్తకంలో నమోదు చేశాడు. అది The Light శీర్షికతో ఇంగ్లిష్‌లోకి అనువాదమైంది. దేశ విభజన తర్వాత సజ్జాద్ జహీర్ పాకిస్థాన్ వలసపోయాడు. అక్కడ కూడా పాకిస్థాన్ ప్రగతిశీల రచయితల సంఘాన్ని ఏర్పాటుచేసి పాకిస్థాన్ ప్రభుత్వ నిర్బంధాన్ని సైతం ఎదుర్కొని ప్రగతిశీల సాహిత్యోద్యమాన్ని కొనసాగించాడు. పాకిస్థాన్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై పనిచేస్తున్న సజ్జాద్ జహీర్‌ను పాకిస్థాన్ మిలటరీ ప్రభుత్వం అరెస్టుచేసి నాలుగేండ్లు జైల్లో నిర్బంధించింది. విడుదల తర్వాత సజ్జాద్ జహీర్ భారత్ తిరిగి వచ్చాడు.
భారత ప్రభుత్వం హిందుస్థానీ సంగీత శిఖరం ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్‌కు పౌరసత్వం ఇచ్చి గౌరవించినట్టుగానే సజ్జాద్ జహీర్‌కు కూడా భారత పౌరసత్వం ప్రసాదించింది. భారత్‌లో కూడా ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో చేరి ప్రగతిశీల సాహిత్య, సాంస్కృతికోద్యమాన్ని చివరికంటా కొనసాగించాడు. ఆఫ్రో-ఆసియా దేశాల రచయితల సంఘం భారతదేశ విభాగానికి సెక్రెటరీగా ఎన్నికయ్యారు. 1973లో అప్పటి సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉన్న కజకిస్థాన్ రాజధాని అల్మా ఆటాలో జరుగుతున్న ఆసియా, ఆఫ్రికా దేశాల ప్రగతిశీల రచయితల కాన్ఫరెన్స్‌లో సెప్టెంబర్ 13న 67 ఏండ్ల వయసులో గుండెపోటుతో కన్నుమూశాడు.
భారతదేశంలో ప్రగతిశీల సాహిత్య, సాంస్కృతికోద్యమానికి ముస్లిం రచయితలే ప్రాణం పోశారని ప్రగతిశీల సాహిత్యోద్యమ చరిత్రను గమనిస్తే అర్థమవుతుంది. సాహిత్యరంగమే కాదు, హిందుస్థానీ సంగీతాన్ని నిలబెట్టింది కూడా ముస్లిం ఉస్తాదులే.
పాటియాల, కిరాణా, ఆగ్రా, గ్వాలియర్, భేండి బాజార్, రాంపూర్ తదితర హిందుస్థానీ సంగీత ఘరానాల మూల పురుషులు ముస్లింలే. సోషలిస్ట్ ప్రగతి బాటలో, దోపిడీ లేని స్వతంత్ర భారతదేశం ఏర్పడాలని కలలుగన్నారు. కానీ, 75 ఏండ్ల తర్వాత చూస్తే వారు కన్న కలలన్నీ కల్లలయ్యాయి. దేశం మతతత్వ ఫాసిస్ట్ రాజ్యంగా రూపుదాల్చింది. విశాల ప్రజానీకాన్ని మతపరంగా విభజన చేసి రాజ్యాంగ ధర్మాన్ని నిలబెట్టే బదులు మతతత్వాన్ని నిలబెట్టే తిరోగమన దిశలో దేశాన్ని నడిపిస్తున్నారు ఇప్పటి పాలకులు. ముస్లింలను దేశ ద్రోహులుగా, విజాతీయులుగా, ముద్రవేసే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. అందుకే దేశంలో ప్రగతిశీల సాహిత్య, సాంస్కృతికోద్యమానికి పునాదులు వేసిన ఆ మహనీయులను తలచుకొని తిరిగి మతతత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా రచయితలు, కవులు, కళాకారులు తమ కలాలకు, గళాలకు పదును పెట్టాల్సిన సమయం ఇదే.