మహిళల ఆరోగ్యంపై మెనోపాజ్ ఎంతో ప్రభావం చూపుతుంది. ఈమధ్య చాలామంది చిన్న వయసులోనే మెనోపాజ్ దశకు చేరుకుంటున్నారు. ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మానసిక ఒత్తిడి, కండరాల నొప్పి, నిద్రలేమి, లైంగిక సమస్యలు అధికం అవుతున్నాయి. అయితే ఈ సమస్యలన్నిటికీ మ్యూజిక్ థెరపీ చక్కటి పరిష్కారమని ఇటీవల జరిగిన అధ్యయనం తెలుపుతున్నది. ఈ విషయం నార్త్ అమెరికన్ మెనోపాజ్ సొసైటీ ప్రచురించే ప్రత్యేక జర్నల్లో ప్రచురితమైంది. ఇప్పటివరకు ధ్యానం, హిప్నాసిస్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలపై జరిగినంత పరిశోధన మ్యూజిక్ థెరపీపై జరగలేదు. అంతేకాదు, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ కూడా మెనోపాజ్ సమస్యలను తగ్గించేందుకు ఉపకరిస్తుందని చెబుతున్నారు. కానీ, దానివల్ల గుండె జబ్బులు వస్తాయని వివిధ సర్వేల్లో తేలింది. ‘తాజా అధ్యయనం మ్యూజిక్ థెరపీ ప్రయోజనాలను స్పష్టంగా తెలుపుతున్నది. సంగీతం న్యూరోట్రాన్స్మిటర్స్ అయిన డోపమైన్, సెరోటోనిన్ హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇవి సంతోషాన్ని, ఆత్మస్థయిర్యాన్ని పెంచుతాయి’ అంటున్నారు పరిశోధన బృందానికి నాయకత్వం వహిస్తున్న డాక్టర్ స్టీఫెన్ ఫ్యాబియన్.