గరళం ఈశునికి.. గంగాళం ఏలికకు!
మూసీ ప్రాజెక్టులో కాంగ్రెస్ సర్కార్ కపటత్వాన్ని నిర్ధారిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఈనెల 7న జీవో ఆర్టీ నవంబర్ 928ని విడుదల చేసింది. మూసీ పునరుజ్జీవం పేరుతో గండిపేట మండలం మంచిరేవుల వద్ద పాలనాపరమైన అనుమతులతో ఏకంగా రూ.1108.27 కోట్లు మంజూరు చేసింది.
యోగ శాస్త్ర దర్శనంలో సహస్రారమే సదాశివుని స్థానం. అక్కడి నుంచి ప్రవహించే అమృత రసమే గంగాధార. శివుడు గంగను ధరించడం అంటే విధ్వంసాన్ని జీవన ప్రదాయినిగా.. కల్మషాన్ని పవిత్రతగా.. ఉగ్రత్వాన్ని శాంతంగా మార్చే అత్యున్నత రక్షణ తంత్రం. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన ప్రాణాంతక గరళాన్ని తాను దిగమింగి లోకానికి అమృతాన్ని ప్రసాదించే త్యాగమే శివతత్వం. ప్రకృతి ప్రళయాన్ని తన శిరస్సున నిలిపి, సమస్త జీవకోటికి అమృతదాయినిగా మలచడమనే నిత్య ఓంకారేశ్వర సంకేతం. ఆ.. ఓంకారేశ్వరనాథుని ముందుపెట్టే రూ.లక్షన్నర కోట్ల నిధి కోసం హస్తం పార్టీ పాలకులు మూసీ నది మథనం మొదలుపెట్టారు. ప్రజలు, ప్రతిపక్షాలు ఒక దిక్కు.. పాలకులు మరో దిక్కు. గరళాన్ని దైవానికి నైవేద్యంగా పెట్టి..అమృత గంగాళాన్నీ దిగమింగే క్రతువుకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
మూసీ ప్రాజెక్టులో కాంగ్రెస్ సర్కార్ కపటత్వాన్ని నిర్ధారిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఈనెల 7న జీవో ఆర్టీ నవంబర్ 928ని విడుదల చేసింది. మూసీ పునరుజ్జీవం పేరుతో గండిపేట మండలం మంచిరేవుల వద్ద పాలనాపరమైన అనుమతులతో ఏకంగా రూ.1108.27 కోట్లు మంజూరు చేసింది. శ్రీ ఓంకారేశ్వర స్వామి ప్రధాన ఆలయం, ఉపాలయాలు, రాజగోపురాలు, భారీ శివుని విగ్రహం, పుష్కరిణి పేరిట రూ.948.65 కోట్ల ముడుపు కట్టిండ్రు. పనిలో పనిగా ఇస్తానా విల్లాస్ నుంచి కీర్తి వెస్ట్ విండ్ విల్లాస్ మీదుగా 100 అడుగుల వెడల్పుతో 2.50 కిలోమీటర్ల ఆరు లేన్ల రోడ్డు నిర్మాణానికి మరో రూ.159.62 కోట్లు రాసిచ్చారు. ఆశ్చర్యకరమైన విషయమేమంటే రూ.1108.27 కోట్ల ఖర్చునంతా నదిని బాగుచేయాల్సిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పద్దు నుంచే సర్దుబాటు చేశారు. నది సంస్కృతి, స్వచ్ఛతను కాపాడాల్సిన ఖాతా నుంచి కాంక్రీట్ కట్టడాలు, లగ్జరీ విల్లాల దారులకు నిధులు మళ్లించడం ఆధ్యాత్మిక ముసుగులో నయా వ్యాపారం.
మూసీ సమగ్ర ప్రక్షాళన కోసం లక్షన్నర కోట్ల రూపాయల బృహత్ ప్రణాళికలు, విదేశీ బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు ఎత్తుతున్న ప్రభుత్వం, మూసీ మురుగు నీటిని వంద శాతం శుద్ధి చేసే అత్యున్నత సాంకేతిక ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి, మురుగు కాలువలను పూర్తిగా మళ్లించడానికి సమగ్ర బడ్జెట్ కేటాయింపులు చేయలేదు. కేవలం ద్వితీయ శ్రేణి శుద్ధి మాత్రమే జరిగే అరకొర ఎస్టీపీలతో నది జీవవైవిధ్యం బతకదు. నదీ పునరుజ్జీవం అంటే నదికి ప్రాణ వాయువును అందించడం. జీవశాస్త్ర పరిభాషలో బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ స్థాయిని కుదించటం. ఆ పనికి పూనుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. హైదరాబాద్ మహానగరంలో ప్రతిరోజూ దాదాపు 1,950 నుంచి 2000 మిలియన్ లీటర్ల మురుగునీరు పారుతున్నది. తెలంగాణ రాష్ట్రం రాక ముందు నగరవ్యాప్తంగా ఉన్న పాత ప్లాంట్ల ద్వారా 330 ఎంఎల్డీ మురుగు శుద్ధి జరిగేది.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 772 ఎంఎల్డీలకు పెంచారు. ఈ లెక్కన ఉత్పత్తి అవుతున్న మురుగులో దాదాపు 60 శాతానికి పైగా ఎలాంటి శుద్ధి లేకుండానే నేరుగా నాలాల ద్వారా మూసీ, ఈసా నదుల్లో కలుస్తున్నది. కరెంటు కోతలు పోయి, సాగు వ్యథలు తగ్గి, తెలంగాణ రాష్ట్రం జరంత కుదుట పడ్డ తర్వాత కేసీఆర్ మూసీ మీద దృష్టి పెట్టారు.
మహానగర వ్యాప్తంగా రూ 3,866 కోట్ల వ్యయంతో 31 కొత్త ఎస్టీపీల ఏర్పాటుతో 100 శాతం మురుగునీటి శుద్ధిని సంకల్పించారు. పాత ప్లాంట్ల ద్వారా 772 ఎంఎల్డీలు, కొత్త ప్లాంట్లతో 1,259.50 ఎంఎల్డీలు కలిపి మొత్తం 2032 ఎంఎల్డీల మురుగునీటి శుద్ధి కోసం నిధులు కేటాయించారు. ఆల్వాల్, కుత్బుల్లాపూర్, కాప్రా పరిసరాల్లో 8 ఎస్టీపీలు; రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, మూసీ దక్షిణ ప్రాంతాలు 6 ఎస్టీపీలు; ఎల్బీనగర్, ఉప్పల్, మూసీ ఉత్తర పరీవాహక ప్రాంతాలు 17 ఎస్టీపీల సామర్థ్యంతో మూడు ప్యాకేజీలుగా విభజించి చేపట్టారు. క్యాబినెట్ ఆమోదం పొంది పనులు వివిధ దశలకు చేరుకున్నాయి. అంతా అనుకున్నట్టు జరిగితే మల్లన్నసాగర్ నుంచి నీళ్లు తెచ్చి మూసీలో పోయాలని భావించారు. కానీ ఇంతలో ప్రభుత్వం మారింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చీ రావడంతోనే మూసీ ప్రక్షాళన రాగం అందుకున్నది. పైసల్ లేవు లేవంటూనే లక్షన్నర కోట్ల రూపాయలకు లంగర్ ఎత్తింది. నదిని శుద్ధి చేసే పనులను పక్కన పెట్టి కాంక్రీట్ కట్టడాల కోసం ఉత్తర్వుల మీద ఉత్తర్వులు ఇస్తున్నది. మంచిరేవుల వద్ద ఏకంగా రూ 1108.27 కోట్లు మంజూరు చేసిన జీవో ఆ ప్రాంతంలో నదిలోకి వచ్చిపడుతున్న కాలుష్య జలాలను శుద్ధి చేసేందుకు ఒక్క పైసా కూడా కేటాయించకపోవడం ప్రభుత్వ ప్రాధాన్యతల్లోని తీవ్రమైన అసమతుల్యతను బయటపెడుతున్నది. నదిని నిర్మలంగా మార్చే శాస్త్రీయ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మాత్రం విదేశీ అప్పుల వేటలో అటకెక్కగా, కాంక్రీట్ కట్టడాలకు, గుడి గోపురాలకు మాత్రం ఖజానా నుంచి వెనువెంటనే వేల కోట్లు ధారపోయడం వెనుక దాగిన లోగుట్టు పాలకులే చెప్పాలి. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో విష్ణుపాదోద్భవియై ముచుకుందా.. ఉస్మాన్సాగర్ వరకు తీపి జలాలతోనే సాగుతున్నది. కానీ గండిపేట దిగువకు వచ్చేసరికి మురుగు తోడై విషం పులుముకుంటున్నది. మంచిరేవుల వచ్చేసరికి నది జీవధాతు చచ్చిపోయి సంపూర్ణ విష రసాయనాలు, మురుగు ప్రవాహంగా రూపాంతరం చెందుతున్నది. ఇక అక్కడి నుంచి మహానగరం విడుదల చేస్తున్న మురుగు మూసీలోనే కలుస్తుంది. ఆ దుర్గంధపు ఒడ్డున రూ.948.65 కోట్లతో ఓంకారేశ్వరుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడమంటే దైవాన్ని అవమానించడం కాక మరేమిటి?
ఏ శివుడిని జలాలు, పంచామృతాలతో అభిషేకిస్తరు. కానీ శివుని ముంగిట, మురుగునీరు పారించి దైవారాధన చేస్తున్నామనడం కంటే బరితెగింపు మరొకటి ఉంటుందా? గతంలో యాదాద్రి పునర్నిర్మాణంతో కేసీఆర్ ధార్మిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్తే.. దానికి పోటీగా రేవంత్ సర్కార్ ‘దక్షిణాది శివుడు’ అంటూ ఓ కార్డును తెరపైకి తెచ్చింది. కానీ ఇక్కడ వ్యత్యాసం సుస్పష్టం. యాదాద్రి ఒక స్వతంత్ర ఆధ్యాత్మిక క్షేత్ర పునర్నిర్మాణం. మంచిరేవుల ప్రాజెక్ట్ మాత్రం మూసీ పునరుజ్జీవం అనే పర్యావరణ ప్రాజెక్టు ముసుగులో జరుగుతున్న రియల్ ఎస్టేట్ విస్తరణ. చుట్టుపక్కల భూముల విలువను పెంచి, అస్మదీయులకు పక్కాగా లబ్ధి చేకూర్చే ఆశ్రితపక్షపాతంతో కూడిన పెట్టుబడిదారీ విధానం (క్రోనీ క్యాపిటలిజం). 928 జీవో నంబర్లో 6 లేన్ల రోడ్లు నిర్మాణ ప్రస్తావన తేవడంలోనే ఆశ్రిత పెట్టుబడిదారీ వర్గపు కుట్రపూరిత నమూనా స్పష్టంగా కనిపిస్తున్నది. రోడ్లు ఎక్కడినుంచి ఎక్కడికి వేస్తున్నారు? ఇస్తానా విల్లాస్ నుంచి కీర్తి వెస్ట్ విండ్ విల్లాస్ వైపు. అంటే హైదరాబాద్లోని అత్యంత సంపన్న రియల్ ఎస్టేట్ ప్రాంతాలకు అన్నమాట. ప్రభుత్వ-ప్రైవేట్ వర్గాల విల్లా ప్రాజెక్టుల విలువను ఆకాశానికి పెంచడానికే రూ.160 కోట్ల వ్యయంతో చేపట్టే రోడ్డు పనులు. ఆధ్యాత్మికత పేరుతో ఆలయం కట్టి, ఆ ఆలయం పేరుతో రోడ్లు వేసి, కొందరికి లబ్ధి చేకూర్చడమే తప్ప ప్రణాళికలో నదీ పరిరక్షణ ఎక్కడున్నది? ఇందులో సంపన్నుల రియల్ వెంచర్లకు ప్రభుత్వ ఖజానా నుంచి మార్గం సుగమం చేయడమే కనిపిస్తున్నది.
సమాజంలో అత్యంత అట్టడుగున ఉన్న అభాగ్యులే పరమశివుడి ప్రమథ గణాలని వేదాంతం ప్రబోధిస్తున్నది. కానీ పాలకులేమో నది దిగువన తరతరాలుగా నివసిస్తున్న నిరుపేదల, శ్రామికుల గూళ్లను కూల్చివేయడానికి బుల్డోజర్లను మోహరించిండ్రు. భస్మధారియై, శ్మశానవాసియై ఆర్తుల ఆర్తనాదాలను ఆలకించే ఆ కరుణామయుడి పేరిట పేదల గుడిసెలపైకి అధికార యంత్రాంగాన్ని ఉసిగొల్పుతున్నరు.
అణగారిన జనం తమ ఆవాసాల కోసం, బతుకుదెరువు కోసం అరుపులకు తెరచాటు అడ్డుపెట్టి, బాధితుల పక్షాన గొంతెత్తిన బీఆర్ఎస్ను దైవకార్యానికి అడ్డంకులుగా చిత్రీకరించే ప్రమాదకర రాజకీయ ఎత్తుగడ ఇది. ‘ఉత్తరాదిన రాముడు.. దక్షిణాదిన శివుడు’ అంటూ పలికిన రాజకీయ ప్రగల్భాల వెనుక ఉన్న భక్తి ఏమిటో ప్రభుత్వ ఉత్తర్వులతో తేలిపోయింది. ‘మా శివుడు పేదల దేవుడు’ అంటూ ప్రకటిస్తూనే ఈశున్ని కాంక్రీట్ ప్రాకారాల్లో, కాంట్రాక్టర్ల లాభాల్లో బందీ చేయాలనుకోవడం మూర్ఖత్వం. మూసీని రసాయనాల మురుగు నుంచి విముక్తం చేసి, అనంతగిరి కొండల్లో ఉద్భవించిన స్వచ్ఛమైన జలధారను పునరుద్ధరించడమే ఆ శంకరునికి చేసే నిజమైన పూజ. ఆ ప్రాథమిక కర్తవ్యాన్ని గాలికొదిలేసి.. కలుషిత గరళాన్ని నదికి, దైవానికి సమర్పిస్తూ, ప్రజాధనమనే అమృతపు గంగాళాలను స్వార్థ రాజకీయాల కోసం నింపుకొంటామంటే చరిత్ర క్షమించదు, ప్రజలు హర్షించరు, సాక్షాత్తూ ఆ నీలకంఠుడూ ఉపేక్షించడు. అయినా ఇష్టారాజ్యంగా ముందు కు పోతే రుద్రుడి ఆగ్రహం తప్పదు.
గతంలో యాదాద్రి పునర్నిర్మాణంతో కేసీఆర్ ధార్మిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్తే.. దానికి పోటీగా రేవంత్ సర్కార్ ‘దక్షిణాది శివుడు’ అంటూ ఓ కార్డును తెరపైకి తెచ్చింది. కానీ ఇక్కడ వ్యత్యాసం సుస్పష్టం. యాదాద్రి ఒక స్వతంత్ర ఆధ్యాత్మిక క్షేత్ర పునర్నిర్మాణం. మంచిరేవుల ప్రాజెక్ట్ మాత్రం మూసీ పునరుజ్జీవం అనే పర్యావరణ ప్రాజెక్టు ముసుగులో జరుగుతున్న రియల్ ఎస్టేట్ విస్తరణ. చుట్టుపక్కల భూముల విలువను పెంచి, అస్మదీయులకు పక్కాగా లబ్ధి చేకూర్చే ఆశ్రితపక్షపాతంతో కూడిన పెట్టుబడిదారీ విధానం.
వర్ధెల్లి వెంకటేశ్వర్లు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

