సిటీబ్యూరో, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ ): కొత్తందాలతో మూసీ తీరం మురవనుంది. మురికికూపంగా మారిన మూసీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని సంకల్పించిన ప్రభుత్వం ప్రత్యేకంగా హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. పీసీబీ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, కుడా శాఖల సమన్వయంతో హెచ్ఆర్డీసీఎల్ విభా గం సరికొత్త అందాలతో అద్భుతమైన పర్యాటక క్షేత్రంగా మూసీని మలిచేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే మూసీని 100 శాతం స్వచ్ఛంగా మార్చేందుకు జలమండలి ఆధ్వర్యంలో 31 ఎస్టీపీలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మూసీ వెంబడి నూతనంగా రూ.390 కోట్ల అంచనాతో 15 వంతెనల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు ప్రతిబింబించేలా డిజైన్లు సిద్ధం చేశారు. 15 వంతెనల నిర్మాణానికి సంబంధించి కొన్నింటికీ డిజైన్లు ఖరారు చేయగా, మరికొన్ని డిజైన్లలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. వారసత్వ, చారిత్రక ప్రతీకలుగా నిలిచేలా ఈ డిజైన్లను రూపకల్పన చేస్తున్నామని.. ఈ నెలాఖరులోగా ఈ పనులు పూర్తి చేసి టెండర్లను ఆహ్వానించనున్నామని ఓ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.