సిటీబ్యూరో/ఇబ్రహీంపట్నం రూరల్, డిసెంబర్ 23(నమస్తే తెలంగాణ): స్నేహితుడిని నెల రోజు కిందట హత్య చేసి..పూడ్చిపెట్టిన ఉదంతం గురువారం వెలుగులోకి వచ్చింది. ఓ మిస్సింగ్ కేసు దర్యాప్తులో భాగంగా రాచకొండ పోలీసులకు లభించిన క్లూతో ఈ వ్యవహారం బయటపడింది. నల్గొండ జిల్లాకు చెందిన బ్రహ్మచారి, నామా శ్రీనివాస్, రాజు, నరేశ్ స్నేహితులు. బ్రహ్మచారి ఇనుప కడ్డీలకు బంగారు పూతను పూసి.. వాటిని పలు ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో కుదువ పెట్టి రుణం తీసుకుంటాడు. ఈ మోసాలపై గతంలో అతడిపై పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ బంగారు పూత తయారీని నామా శ్రీనివాస్ దగ్గర చేయిస్తుండే వాడు.
స్నేహితుడు కావడంతో శ్రీనివాస్ రూ. 70 వేలను బ్రహ్మచారికి అప్పుగా ఇవ్వగా, అతడు రూ. 50 వేలు తిరిగి ఇచ్చేశాడు. ఇలా వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. కాగా, నామాశ్రీనివాస్ అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. కుటుంబసభ్యులు డిసెంబర్ 14న ఆదిబట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తులో ఓ చిన్న సమాచారం లభించింది. చీటింగ్ కేసులో అరెస్టయిన బ్రహ్మచారిని కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు నామా శ్రీనివాస్‌ను.. రాజు, నరేశ్‌లతో కలిసి నవంబర్ 12న మద్యం తాగిస్తామని తీసుకెళ్లి.. బొంగుళూరు వద్ద చంపేశామని.. ఆ తర్వాత మృతదేహాన్ని ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో పూడ్చిపెట్టామని చెప్పాడు.
దీంతో గురువారం పోలీసులు అక్కడికి వెళ్లి.. ఇబ్రాహీంపట్నం ఏసీపీ బాలకృష్ణారెడ్డి, తహసీల్దార్ అనిత సమక్షంలో శవాన్ని వెలికి తీశారు. ఆ సమయంలో తల దొరకలేదు. మిగతా శరీరానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. తల గురించి బ్రహ్మచారిని విచారించినప్పుడు ఆ విషయం రాజుకు తెలుసని చెప్పడంతో అతడితో పాటు నరేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.