IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. హోరాహోరీగా జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ రోహిత్ శర్మ(65) అర్ధ శతకంతో రాణించాడు. ఆఖర్లో కామెరూన్ గ్రీన్(7), టిమ్ డేవిడ్ (13) ధాటిగా ఆడారు. దాంతో, 20వ ఓవర్ ఆఖరి బంతికి లక్ష్యాన్ని ఛేదించింది. దాంతో, వార్నర్ సేనకు వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది.
లక్ష్య ఛేదనలో ముంబైకి ఓపెనర్లు రోహిత్ శర్మ( 65), ఇషాన్ కిషన్(31) శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు 71 రన్స్ జోడించారు. లలిత్ యాదవ్ ఓవర్లో కిషన్ రనౌటయ్యాడు. ఆ తర్వాత రోహిత్, తిలక్ వర్మ(12)తో కలిసి స్కోర్ వేగం పెంచాడు. తొలి ఓవర్ నుంచి ధాటిగా ఆడిన హిట్‌మ్యాన్ స్వీప్ షాట్లతో అలరించాడు. 29 బంతుల్లో 4 ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ముఖేశ్ కుమార్ వేసిన 16వ ఓవర్లో తిలక్ వర్మ ఒక ఫోర్, రెండు సిక్స్‌లు బాదాడు. 17వ ఓవర్లో అభిషేక్ డైవ్ చేస్తూ ఒంటి చేత్తో క్యాచ్ పట్టడంతో రోహిత్ ఔటయ్యాడు. అప్పటికీ ముంబై విజయానికి 30 రన్స్ కావాలి. ఆఖర్లో కామెరూన్ గ్రీన్(7), టిమ్ డేవిడ్1 (13) ధాటిగా ఆడి గెలిపించారు. ఢిల్లీ బౌలర్లలో ముఖేశ్ కుమార్ వికెట్లు తీశారు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఒక వికెట్ దక్కింది.
Mumbai Indians win off the final delivery! 🙌
Another final-over thriller in #TATAIPL 2023! 💥💥#DCvMI https://t.co/2UAkGXvqMG
— IndianPremierLeague (@IPL) April 11, 2023
సొంత గడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ 172 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్(51), అక్షర్ పటేల్ (54) మాత్రమే అర్ధ శతకాలతో రాణించారు. టాపార్డర్ బ్యాటర్లు పృథ్వీ షా(15), రోవ్‌మన్ పావెల్(4), లలిత్ యాదవ్(2) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. ఆ తర్వాత వార్నర్, అక్షర్ ధాటిగా ఆడడంతో ఢిల్లీ 200 కొట్టేలా కనిపించింది. కానీ, జాసన్ బెహ్రెండార్ఫ్ 19వ ఓవర్లో ఢిల్లీ నాలుగు వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్, వార్నర్, అభిషేక్ పొరెల్(0), కుల్దీప్ యాదవ్(0) ఔటయ్యారు. రిలే మెరిడిత్ ఆఖరి ఓవర్లో అన్రిజ్ నార్జ్(5) ఔటయ్యాడు. దాంతో ఢిల్లీ 172 పరుగులకు ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లలో జాసన్ బెహ్రెండార్ఫ్, పీయూష్ చావ్లా మూడేసి వికెట్లు తీశారు. రిలే మెరిడిత్ రెండు, హృతిక్ షోకీన్ ఒక వికెట్ తీశారు.