Jobbie Startup | సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల కారణంగా రూ.22 లక్షల ప్యాకేజీ జాబ్ ఆఫర్‌ను కోల్పోయాడు ఒక యువకుడు. ఈ ఘటన ముంబైలో జరిగింది. ముంబైకి చెందిన జాబీ (Jobbie) అనే ఒక స్టార్టప్ కంపెనీ.. తన కంపెనీ నియామకాల్లో భాగంగా ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూలో ఒక యువకుడు అద్భుతంగా రాణించాడని.. తన టాలెంట్‌కి ఫిదా అయ్యి తమ బడ్జెట్‌కు మించి రూ. 22 లక్షల ప్యాకేజీ ఇవ్వడానికి కూడా తాము సిద్ధపడ్డామని జాబీ కంపెనీ వ్యవస్థాపకుడు మొహమ్మద్ అహ్మద్ భాటి వెల్లడించారు. అయితే బ్యాక్‌గ్రౌండ్ చెక్‌లో ఆ యువకుడు సోషల్ మీడియా వేదికగా మతపరమైన విద్వేష వ్యాఖ్యలు చేసినట్లు తాము గుర్తించామని దీంతో అతడి జాబ్ ఆఫర్‌ను రద్దు చేస్తున్నట్లు జాబీ (Jobbie) ప్రకటించింది.
ఈ విషయంపై కంపెనీ సీఈవో మాట్లాడుతూ.. ఎంత ప్రతిభ ఉన్నా, మాకు గౌరవం, మర్యాద చాలా ముఖ్యం. ప్రతిభ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లినా, మీరు కొనసాగాలా వద్దా అనేది మీ విలువలు నిర్ణయిస్తాయి. జాబీ టీమ్ అందరి వైవిధ్యాన్ని, గౌరవాన్ని ప్రోత్సహిస్తుందని, అందుకే అభ్యర్థి అభిప్రాయాలు తమ కంపెనీ విలువలకు (values) విరుద్ధంగా ఉన్నాయని సీఈవో భాటి స్పష్టం చేశారు.
ఈ విషయంపై నెటిజన్ల మధ్య తీవ్ర వాదనలు జరుగుతున్నాయి. కొందరు వ్యవస్థాపకుడి నిర్ణయాన్ని సమర్థిస్తూ, ఉద్యోగంలో విలువలు చాలా ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు సోషల్ మీడియా పోస్ట్‌ల ఆధారంగా ఉద్యోగ ఆఫర్‌ను రద్దు చేయడం ‘క్యాన్సిల్ కల్చర్’కు ఉదాహరణ అని, ఇది ఉద్యోగుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించివేస్తుందని విమర్శిస్తున్నారు. ఒక అభ్యర్థి తన వృత్తిపరమైన పనితీరుపై దృష్టి పెట్టాలా లేక సోషల్ మీడియాలో తన అభిప్రాయాలపై జాగ్రత్తగా ఉండాలా అనే చర్చకు ఈ ఘటన దారి తీసింది.