సిటీబ్యూరో, నవంబర్ 11 ( నమస్తే తెలంగాణ ) : నిరుపేదల ఆత్మగౌరవానికి పట్టం కట్టేలా రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగానే బృహత్తర నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ప్రజల అవసరాలకు అనుగుణంగా సకల సదుపాయాలు కల్పించేందుకు మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లు, అత్యాధునిక శ్మశానవాటికల నిర్మాణాలను ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేస్తోంది. సుమారు రూ. 80 కోట్ల అంచనాతో ఈ పనులు సాగుతున్నాయి. ఫేజ్‌ల వారీగా నగరంలోని పలు ప్రాంతాల్లో సకల వసతులతో ఫంక్షన్ హాళ్లు, శ్మశాన వాటికల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరికొద్ది రోజుల్లో మిగిలిన నిర్మాణ పనులు పూర్తికానున్నాయి. గతంలో ఏ ప్రభుత్వం సాహసించని విధంగా తెలంగాణ ప్రభుత్వం పేదోడి అవసరానికి పెద్దపీట వేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సగర్వంగా వేడుకలు..
మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణాల కోసం రూ.34 కోట్ల అంచనా వ్యయంతో సర్కార్ 14 పనులను చేపట్టింది. బేగంపేట సర్కిల్లో బన్సీలాల్‌పేట్, బోయగూడ పోలీస్ స్టేషన్, నెహ్రూనగర్ పార్క్ మారేడుపల్లి, పటాన్చెరువు సర్కిల్లో చైతన్యనగర్, సికింద్రాబాద్ సర్కిల్లో సీతాఫల్‌మండీ టీఆర్టీ క్వార్టర్స్, ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలో గాంధీ విగ్రహం వద్ద, రామంతాపూర్ గాంధీనగర్ 4 ఫేస్, కేపీహెచ్‌బీ కాలనీ గాజులరామారం తదితర మొత్తం 8 పనులు రూ.23.73 కోట్ల వ్యయంతో పూర్తయ్యాయి. మిగిలిన 2 పనులలో అదనపు పనులు పూర్తి చేయాల్సి ఉంది. మరో 4 పనులు వివిధ ప్రగతి దశలో ఉన్నాయి. సకల వసతులతో మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది.
అత్యాధునిక శ్మశానవాటికలు..
సుమారు రూ.46 కోట్ల వ్యయంతో రెండు దశల్లో 33 మోడల్ శ్మశాన వాటికల నిర్మాణం జరుగుతోంది. మొదటి దశలో భాగంగా రూ.24.13 కోట్ల అంచనా వ్యయంతో 24 పనులు చేపట్టగా అన్నీ పనులు పూర్తయ్యాయి. శ్మశాన వాటికలకు ప్రహరీ, వాచ్ ఏరియా, బర్నింగ్ ఫ్లాట్ ఫాం, ప్రేయర్ హాల్ వెయింటింగ్ ఏరియా, సిట్టింగ్ గ్యాలరీ, పార్కింగ్ స్థలం, ఆఫీస్ స్థలం, అంత్యక్రియలకు సంబంధించిన సామగ్రి దుకాణం, లైటింగ్ ఇతర అవసరమైన వసతులు కల్పించారు. రెండో దశలో రూ.21.77 కోట్లతో 9 పనులు చేపట్టగా అందులో 3 పూర్తయ్యాయి. మిగిలిన పనులు వివిధ అభివృద్ధి దశల్లో ఉన్నాయి. అసంపూర్తిగా ఉన్న పనులను నిర్దేశిత కాల వ్యవధిలో పూర్తి చేయనున్నారు.