అబిడ్స్, నవంబర్ 11 : పేద, మధ్య తరగతి ప్రజలు వివాహాది శుభకార్యాలు చేసుకునేందుకు వీలుగా కోట్లాది రూపాయల వ్యయంతో జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్‌హాళ్ల నిర్మాణాన్ని చేపడుతున్నది. ఇందులో భాగంగా గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని జుమ్మెరాత్ బజార్ ప్రాంతంలో 1.80 కోట్ల నిధులతో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ పనులను గత సంవత్సరం జనవరిలో అధికారులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నారు. ప్రయివేట్ ఫంక్షన్ హాళ్లలో అధిక ధరలను చెల్లించి శుభకార్యాలను నిర్వహించుకోలేని నిరు పేదలకు ఉపయోగకరంగా ఉండేందుకు ఈ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్‌లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీలైనంత త్వరలో ఫంక్షన్హాల్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్ పర్యవేక్షణలో ఎస్ఈ సహదేవ్ రత్నాకర్ నేతృత్వంలో ఈఈ ప్రకాశం పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి త్వరితగతిన పూర్తయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
మూడు నెలల్లో పనులు పూర్తి
జుమ్మెరాత్‌బజార్‌లో నిర్మితమవుతున్న మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులు మరో మూడు నెలలో పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పనులు పూర్తయిన పిదప మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చూస్తున్నామని 14వ సర్కిల్ ఈఈ ప్రకాశం తెలిపారు.