MSVPG | మెగాస్టార్ చిరంజీవి -అనీల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న భారీ ప్యాన్ ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ (MSVPG) సంక్రాంతి 2026కు సిద్ధమవుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదల నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా విడుదలైన పోస్టర్లు, ‘మీసాల పిల్ల’ సాంగ్ సోషల్ మీడియాలో భారీ సెన్సేషన్ సృష్టించాయి. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన నయనతార నటిస్తుండగా, మరో స్పెషల్ ఆకర్షణగా విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. కేవలం క్యామియో మాత్రమే కాదు… చిరుతో కలిసి ఒక మాస్ సాంగ్‌లో స్టెప్స్ వేసిన వెంకీ పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
అయితే మాస్ సాంగ్ షూట్ ముగిసిన వెంటనే వెంకటేష్ తన పాత్రకు సంబంధించిన మొత్తం షూట్ పూర్తయ్యిందని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో .. “మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నా పాత్ర షూటింగ్ ముగిసింది. ఇది అద్భుతమైన అనుభవం! నాకు ఇష్టమైన మెగాస్టార్ చిరంజీవితో కలిసి పనిచేయడం ఎంతో ఆనందం. ఈ సినిమా ఎన్నో అందమైన జ్ఞాపకాలను మిగిల్చింది. మమ్మల్ని ఇలా ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకువచ్చిన అనిల్ రావిపూడికి ప్రత్యేక ధన్యవాదాలు. 2026 సంక్రాంతిని మీ అందరితో థియేటర్లలో సెలబ్రేట్ చేయడానికి ఎదురు చూడలేకపోతున్నాను అని రాసుకొచ్చారు.
వెంకీ ట్వీట్‌కి స్పందించిన చిరంజీవి.. “మై డియర్ బ్రదర్ వెంకీ… మనం కలిసి పనిచేసిన పది రోజులు అద్భుతంగా గడిచాయి. మీ ప్రజెన్స్ ఎనర్జీని, సంతోషాన్ని తీసుకొచ్చింది. ‘మన శంకర వరప్రసాద్ గారు’కి మీరు ప్రత్యేక టచ్ ఇచ్చారు. ప్రతిక్షణాన్ని ఆస్వాదించాను.” అని అన్నారు. చిరు-వెంకీ పరస్పరం ప్రేమ, గౌరవం పంచుకుంటూ చేసిన పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే స్క్రీన్‌పై కనిపించబోతుండటంతో అభిమానుల్లో క్రేజ్ మరింత పెరిగింది. మెగాస్టార్–విక్టరీ కాంబో మ్యాజిక్ ఎలా ఉంటుందో చూడాలంటే వచ్చే ఏడాది సంక్రాంతి వరకు ఆగాల్సిందే.