న్యూఢిల్లీ, డిసెంబర్ 3 : రోజురోజుకూ దారుణంగా పడిపోతున్న రూపాయి విలువ కంటికి కనిపించని దెబ్బ కొడుతున్నది. డాలరుతో రూపాయి మారకం విలువ బుధవారం రూ.90 దాటింది. రూపాయి విలువ బలహీనపడుతున్నకొద్దీ దిగుమతి సరుకుల ధరలు భారీగా పెరుగుతుండగా, ఎగుమతి అయ్యే వస్తువులు చౌకగా మారిపోతున్నాయి. ముఖ్యంగా చమురు, ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. పతనమవుతున్న రూపాయి విలువతో ప్రధానంగా ప్రభావితమవుతున్నవారు విదేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు. ఇది వారి కుటుంబాలను కంటికి కనిపించని రీతిలో దెబ్బ కొడుతున్నది. రూపాయి విలువ తగ్గడం కారణంగా అమెరికా, బ్రిటన్, ఇటలీ, జర్మనీ, సింగపూర్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో చదువుతున్న విద్యార్థులు, వారి కుటుంబాలకు ఆర్థిక భారం తడిసి మోపెడవుతున్నది.
ఇటు రూపాయి పతనం అటు విద్యార్థుల వార్షిక ఫీజు, వారి జీవనంపై భారం మోపుతున్నది. ఫీజులు లక్షల్లో పెరుగుతున్నాయి. అదే సమయంలో విదేశీ మారకంలో తీసుకున్న విద్యా రుణాలు కూడా పెరిగిపోతున్నాయి. గత ఏడాది భారత్ నుంచి విదేశాలకు చదువుకోవడానికి వెళ్లిన వారి సంఖ్య 7.6 లక్షలు. న్యూయార్క్ యూనివర్సిటీలో చదువుతున్న సంజనా కుమార్ తన అనుభవాన్ని చెప్తూ..‘మా తల్లిదండ్రులు నాకు ఖర్చుల కోసం నెలకు 1500 డాలర్లు పంపుతారు. గత ఏడాది డాలర్ విలువ రూ.83.5 ఉన్నప్పుడు నా తల్లిదండ్రులకు రూ.1.25 లక్షలు ఖర్చయ్యేవి. ఇప్పుడు అవే 1500 డాలర్లకు వారికి మరో రూ.10 వేలు ఎక్కువగా ఖర్చవుతున్నాయి’ అని వివరించారు.