హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ కే కేశవరావు తన పుట్టినరోజు సందర్భంగా సోమవారం గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో కుమార్తె, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగా తెలంగాణ అభివృద్ధిలోనూ భాగస్వాములు కావాలని కోరారు. పుట్టిన రోజు, పండుగ రోజుల్లో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతగానో దోహదపడతాయని, మొక్కలు నాటడం ప్రతిఒక్కరి జీవితంలో భాగం కావాలని చెప్పారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారికి కేకే ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.