Raj Kumar | కన్నడ సినీ లెజెండ్ డా. రాజ్ కుమార్ కిడ్నాప్ దృశ్యం దక్షిణాదినే కాక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. స్మగ్లర్ వీరప్పన్ ఆయనను కిడ్నాప్ చేసిన 2000 సంవత్సరం, కర్ణాటక–తమిళనాడు రాష్ట్రాల మద్య ఉద్రిక్తతలకు దారితీసింది. ఇప్పుడీ చారిత్రక ఘటన ఆధారంగా ఓ సినిమా రూపొందనుంది. ఈ ప్రాజెక్ట్‌ను జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ డైరెక్ట్ చేయనుండటం సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. ప్రముఖ నిర్మాత వి.లీలా మనోహర్ ఈ సినిమాను ప్రెస్టీజియస్‌గా నిర్మించనున్నారు. అక్టోబర్‌లో షూటింగ్ ప్రారంభం కానుందని వెల్లడించారు. స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని సమాచారం.
ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్లు, నైపుణ్యం గల నటులను ఎంపిక చేస్తున్నట్టు టీమ్ తెలిపింది. అశోక్, ముని, నాగేశ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. 2000 సంవత్సరంలో స్మగ్లర్ వీరప్పన్.. డా. రాజ్ కుమార్‌ను కిడ్నాప్ చేసి 108 రోజుల పాటు తన చెరలో ఉంచాడు. రాజ్ కుమార్‌తో పాటు ఆయన అల్లుడు గోవింద్ రాజ్, బంధువు నగేశ్, అసిస్టెంట్ డైరెక్టర్ నాగప్పల్ని కూడా అపహరించాడు.25 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ సంఘటన జరిగిన సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా కరుణానిధి అధికారంలో ఉన్నారు. అప్పటికే 1999లోనే రాజ్ కుమార్ కిడ్నాప్ లిస్టులో ఉన్నారన్న హెచ్చరికలను సిట్ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం అప్రమత్తం కాలేదన్న ఆరోపణలు వచ్చాయి.
కిడ్నాప్ అనంతరం ప్రభుత్వం, వీరప్పన్‌తో పలు దఫాల చర్చలు జరిపినా అవి ఫలితం చూడలేదు. ఆరు నెలలు దాటిపోయిన తర్వాత వీరప్పన్ ఎలాంటి హాని చేయకుండా రాజ్ కుమార్‌ను విడిచిపెట్టడం మిస్టరీగానే మిగిలిపోయింది. ఇక 2004లో వీరప్పన్ పోలీసు ఎన్కౌంటర్లో హతమయ్యాడు. 2006లో డా. రాజ్ కుమార్ గుండెపోటుతో కన్నుమూశారు. ఈ సినిమా ద్వారా ఆ చారిత్రక సంఘటనలు మరోసారి తెరపైకి రావనున్నాయి. నిజానికి ఈ సినిమాని రియల్ లైఫ్‌కి దగ్గరగా, ఆసక్తికరంగా ఉండేలా తెరకెక్కించేందుకు సినిమా యూనిట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. సినీ ప్రేమికులు, చరిత్రపై ఆసక్తి ఉన్నవారు ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.