హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): సమాఖ్య స్ఫూర్తికి కేంద్రం తూట్లు పొడుస్తున్నదని, రాష్ర్టాల నీటి హక్కులను కాలరాస్తున్నదని పలువురు వక్తలు విమర్శించారు. గోదావరి, కృష్ణా నదులకు సం బంధించి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్) ఆధ్వర్యంలో శనివారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో ‘తెలంగాణ నదీ జలాల సంరక్షణ’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో న్యాయకోవిదుడు ఆచార్య మాడభూషి శ్రీధర్, తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి, ఇంజినీర్స్ జేఏసీ చైర్మన్ తన్నీరు వెంకటేశం, సీనియర్ పాత్రికేయులు కే రామచంద్రమూర్తి, కే శ్రీనివాస్‌రెడ్డితోపాటు పలు పార్టీల నేతలు, సాగునీటి రంగ నిపుణులు, మేధావులు పాల్గొన్నారు. తెలంగాణ, ఏపీ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి గా రివర్ బోర్డుల పరిధిలోనికి తీసుకువస్తూ జూలై 15న కేంద్రం విడుదల చేసిన గెజిట్‌ను వక్తలంతా ముక్తకంఠంతో ఖండించారు. కేంద్రం సమాఖ్య స్ఫూర్తి ని కాలరాస్తున్నదని, రాష్ర్టాలపై పెత్తనం చెలాయించేందుకు కుట్రలు పన్నుతున్నదని ధ్వజమెత్తారు. కేంద్రం నిర్ణయాల వల్ల రాష్ట్ర ఏర్పాటు తరువాత కూడా తెలంగాణ ప్రాంతం నదీ జలాల్లో న్యాయమైన నీటి హక్కులను పొందలేకపోతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ర్టాల్లో నీటిపారుదల వ్యవస్థ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా గెజిట్‌ను రూపొందించిందని ధ్వజమెత్తారు. ఎలాంటి నీటి వివాదాలు లేని గోదావరి ప్రాజెక్టులను సైతం బోర్డు పరిధిలోకి తీసుకురావడం దుర్మార్గమని మండిపడ్డారు. ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి నీటి వాటా ల్లో రాష్ర్టాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించకుండా, ఆ వివాదాల సాకుతో మొత్తంగా రాష్ర్టాల నీటిహక్కులనే చిదిమేయాలని చూస్తున్నదని ఆక్షేపించారు.