ఆరోగ్యాన్ని అందించే మునగ.. అందాన్ని కాపాడటంలోనూ ముందుంటుంది. ముఖ్యంగా, మునగ నూనె.. చర్మ సౌందర్యానికి చక్కగా పనిచేస్తుంది. ఇందులో యాంటి మైక్రోబయల్, యాంటి బ్యాక్టీరియల్, యాంటి ఆక్సిడెంట్, యాంటి ఫంగల్, యాంటి ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అవన్నీ.. చర్మ ఆరోగ్యానికి భరోసా అందిస్తాయి.
మునగ నూనెలోని యాంటి ఆక్సిడెంట్లు.. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. చర్మం యవ్వనంగా, ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి. ఇందులోని విటమిన్ సి.. కొలాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. వృద్ధాప్య ఛాయలను తరిమేస్తుంది.
చలికాలంలో చర్మం పగిలిపోకుండా కాపాడటంలోనూ మునగ నూనె సమర్థంగా పనిచేస్తుంది. స్నానం చేసిన తర్వాత.. మునగ నూనె రాసుకొని, సున్నితంగా మర్దనా చేసుకోవాలి. దాంతో, చర్మంలో రోజంతా తేమ నిలిచి ఉంటుంది. రాత్రిపూట నిద్రపోయే ముందు ఈ నూనెను చర్మానికి రాసుకున్నా.. మంచి ఫలితం కనిపిస్తుంది.
పొడిచర్మం ఉన్నవారికి మునగ నూనె ఎంతో మేలు చేస్తుంది. చర్మం లోపలి పొరల్లోకి చేరుకొని.. తేమను అందిస్తుంది. ఇందులోని ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు.. చర్మానికి తేమతోపాటు పోషణ కూడా అందిస్తాయి.
మునగ నూనెలో విటమిన్ సితోపాటు విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తాయి. చర్మంపై ఉండే మచ్చలను తొలగించడంలో ముందుంటాయి. నల్లమచ్చలు, మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు, పిగ్మెంటేషన్‌తో బాధపడేవారికి మునగ నూనె మంచి ఉపశమనం అందిస్తుంది. ఇందులోని యాంటి ఇన్ఫ్లమేటరీ, యాంటి సెప్టిక్ గుణాలు.. చర్మంపై కాలిన మచ్చలు, గాయాలను త్వరగా నయం చేయడంలో సాయపడతాయి.
చర్మంతోపాటు జుట్టు పోషణలోనూ మునగ అద్భుతంగా పనిచేస్తుంది. జుట్టుకు పోషణనిచ్చే విటమిన్లు, ఖనిజాలు, ఐరన్ వంటివి మునగ నూనెలో సమృద్ధిగా ఉంటాయి. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. హెయిర్ ఫోలికల్స్‌కు పోషణనిచ్చి.. కుదుళ్లను బలంగా మారుస్తుంది.
మునగ నూనెలోని యాంటి ఫంగల్ లక్షణాలు.. చుండ్రును సమర్థంగా తొలగిస్తాయి.
జుట్టుకు సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. జుట్టు పొడిబారడం, చిట్లడం వంటి సమస్యలను తగ్గిస్తుంది.