సిటీబ్యూరో, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా యూనివర్సిటీ కీర్తిప్రతిష్ఠలు విశ్వవ్యాప్తమవుతున్నాయి. దేశంలోనే 7వ పురాతనమైన ఈ విశ్వవిద్యాలయాన్ని 1918లో ఏర్పాటు చేయగా ఏకంగా 130 దేశాల్లో విద్యాసుగంధాలను వెదజల్లుతోంది. శతాబ్ది ఉత్సవాలు పూర్తి చేసుకున్న అరుదైన యూనివర్సిటీల్లో ఒకటైన ఓయూలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 67 దేశాలకు చెందిన విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. కరోనా వ్యాప్తికి ముందు 130కి పైగా దేశాలకు చెందిన విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు పొందినట్లు వీసీ ప్రొఫెసర్ రవీందర్ తెలిపారు. ప్రస్తుతం 2021-22 విద్యా సంవత్సరానికి చెందిన యూజీ, పీజీ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోందని.. అది పూర్తైతే ఎంత మంది విద్యార్థులు.. ఎన్ని దేశాల నుంచి వచ్చారన్న సమగ్ర సమాచారం తెలుస్తుందని యూనివర్సిటీ ఫారిన్ రిలేషన్స్ డైరెక్టర్, ప్రొఫెసర్ వి.అప్పారావు అన్నారు.
ఆఫ్ఘనిస్థాన్ నుంచి 158 మంది విద్యార్థులు..
ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీలో మొత్తం 67 దేశాల విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ఇందులో ఆఫ్ఘనిస్థాన్ నుంచి 158, సుడాన్ నుంచి 134, యెమెన్ -132, సోమాలియా -103, టర్క్మెనిస్థాన్ -98, ఉబ్జెకిస్థాన్ -58, ఈథియోపియా -47, జిబోటీ -44, ఐవరీకోస్ట్ -24, కెన్యా -17 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందినట్లు ఓయూ అధికారులు వెల్లడించారు. ఇందులో ఇండియన్ ఎన్ఆర్ఐలు కూడా 39 మంది ఉన్నట్లు తెలిపారు. 2017 నుంచి 21 వరకు ఐదు సంవత్సరాల్లో మొత్తం 1088 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో చేరారని.. అయితే కరోనా సమయంలో విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గిందన్నారు. తిరిగి పరిస్థితి పుంజుకుంటుండటంతో అడ్మిషన్లు పెరుగుతున్నాయని.. 2012-22 విద్యా సంవత్సరానికి సంబంధించి విదేశీ విద్యార్థుల ప్రవేశాల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
బీఏ, బీకాంలో ప్రవేశాలు..
ముఖ్యంగా విదేశీ విద్యార్థులు బీఏ, బీకాం, బీఎస్సీ కంప్యూటర్స్ కోర్సుల్లో పెద్దఎత్తున ప్రవేశాలు పొందుతున్నారు. మూడేండ్ల యూజీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థుల్లో 25 శాతం వరకు ఇక్కడే ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్కాం కోర్సుల్లో చేరుతున్నారు. మిగిలిన విద్యార్థులు తిరిగి తమ స్వస్థలాలకు వెళ్తున్నట్లు ఓయూ అధికారులు తెలిపారు. నాణ్యమైన విద్య, మంచి ఫ్యాకల్టీ, ప్రపంచవ్యాప్తంగా ఓయూకు ఉన్న గుర్తింపుతో విదేశీ విద్యార్థులు ఇక్కడ అడ్మిషన్లు తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. పైగా ఓయూ అందించే డిగ్రీలకు కూడా మంచిపేరు ఉండటం మరో విశేషం.