చెన్నై, నవంబర్ 17: తమిళనాడులో 30-40 ఏండ్ల వయసున్న నలభై వేలకు పైగా బ్రాహ్మణ యువకులకు పెండ్లి చేసుకొందామంటే రాష్ట్రంలో పిల్లలే దొరకట్లేదు. దీంతో ఆ రాష్ర్టానికి చెందిన బ్రాహ్మణ సంఘం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. వీరి కోసం ఉత్తరప్రదేశ్, బీహార్లో బ్రాహ్మణ అమ్మాయిలను వెతికే పనిలో పడింది. తమిళనాడు బ్రాహ్మణ అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణన్ ఈ విషయాన్ని వెల్లడించారు. అసోసియేషన్ మాసపత్రికలో వివరాలు తెలిపారు. ‘తమిళనాడులో 10 బ్రాహ్మణ బాలురు ఉంటే కేవలం ఆరుగురే బాలికలు ఉన్నారు’ అన్నారు.
యూపీ, బీహార్లో అమ్మాయిలను వెతకడం కోసం అక్కడి బ్రాహ్మణ సంఘాలకు సమాచారం ఇస్తామని చెప్పారు. తమిళనాడులో సమన్వయకర్తగా హిందీ చదవడం, రాయడం వచ్చినవారిని నియమిస్తామన్నారు. చాలా మంది బ్రాహ్మణులు ఈ ఆలోచనను స్వాగతించారు. కొంతమంది మరో రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికీ బ్రాహ్మణుల్లో పెండ్లి అంటే అమ్మాయి తరఫువారే ఖర్చు భరిస్తున్నారని, ఆడంబరంగా వివాహాలు చేసుకోవడం వల్ల ఖర్చు తడిసిమోపెడు అవుతుందని చెప్పారు. దీంతో అమ్మాయిల తల్లిదండ్రులు డబ్బు సమకూర్చుకొనేదాకా పిల్లలకు పెండ్లి చేయడం లేదని తెలిపారు. అమ్మాయిల కొరతకు ఇది కూడా ఒక కారణం అన్నారు.