Mastan Sai Case | మస్తాన్‌సాయి వీడియోల కేసులో మరికొన్ని దిమ్మదిరిగే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. లావణ్య కేసులో మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అశ్లీల వీడియోల కేసులో.. యువతుల ప్రైవేట్ వీడియోలను సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్నాడని.. యువతులు, వివాహితలకు డ్రగ్స్ ఇచ్చి లైంగికవాంఛ తీర్చుకుంటూ వీడియోలు చిత్రీకరిస్తున్నాడంటూ విజయవాడకు చెందిన లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు పోలీసులు జరుపుతున్న దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి.
మస్తాన్ సాయి విల్లాలో శని, ఆదివారాల్లో భారీగా డ్రగ్స్ పార్టీలు జరిగేవని విచారణలో తేలింది. డ్రగ్స్ తీసుకుంటున్న సమయంలోనే మస్తాన్ సాయి వీడియోలు రికార్డు చేస్తున్నట్లుగా వీడియోల్లో గుర్తించారు. యువతులు మత్తులోకి జారుకున్న తర్వాత అమ్మాయిలపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా పోలీసుల విచారణలో తెలిసింది. మస్తాన్ సాయి మొబైల్‌తోపాటు హార్డ్‌డ్రైవ్‌ను స్వాధీనం చేసుకొని ఎఫ్ఎస్ఎల్కు పంపారు. ఇక మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. మస్తాన్ సాయితో పాటు అతని స్నేహితుడు ఖాజాకు డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది. ఈ మత్తులోనే లావణ్య ఇంటికి వెళ్లి గొడవ చేసిన అతనిపై ఎన్డీపీఎస్ సెక్షన్ కింద అభియోగాలను మోపారు.
టాలీవుడ్‌కు చెందిన సినీ నటుడు రాజ్ తరుణ్ తనను పెళ్లి పేరుతో మోసం చేసినట్లుగా లావణ్య గతంలో నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదంలోనే మస్తాన్ సాయి పేరు బయటకు వచ్చింది. లావణ్య సైతం రెండు డ్రగ్స్ కేసుల్లో నిందితురాలుగా ఉన్నట్లు తెలుస్తున్నది. మస్తాన్‌సాయి బీటెక్ చదివి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాడని లావణ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఉనీత్‌రెడ్డి అనే స్నేహితుడి ద్వారా 2022లో పరిచయమయ్యాడని.. యువతులు, వివాహితల్ని లక్ష్యంగా చేసుకుని ఫోన్లు హ్యాక్ చేస్తాడని ఆరోపించింది.
గూగుల్, ఐ-క్లౌడ్‌లోని వ్యక్తిగత చిత్రాలు సేకరించి.. బెదిరింపులకు పాల్పడడంతో పాటు బాధితులకు డ్రగ్స్ ఇచ్చి లైంగిక దాడికి పాల్పడుతాడని.. ఆ సమయంలో వీడియోలు చిత్రీకరించి హార్డ్‌డిస్క్‌ల్లో సేవ్ చేస్తాడని పేర్కొంది. మస్తాన్ సాయి తన వ్యక్తిగత వీడియోలు సైతం తీశాడని.. ప్రశ్నిస్తే లైంగిక దాడికి పాల్పడ్డట్లుగా పేర్కొంది. మస్తాన్‌సాయి ఆకృత్యాలున్న హార్డ్ డ్రైవ్‌ను గతేడాది నవంబర్‌లో తాను తీసుకున్నానని.. దాంతో తమ ఇంట్లోకి చొరబడి తనపై దాడి చేసినట్లు తెలిపింది. హార్డ్‌డిస్క్ కోసం బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయాలన్నీ పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. మస్తాన్‌సాయిని కస్టడీకి కోరనున్నట్లు తెలుస్తున్నది. అతన్ని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.