న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: ఐఫోన్ 16ని మార్కెట్లోకి విడుదల చేసిన మరుక్షణమే ఇతర ఐఫోన్ల ధరలను తగ్గించింది యాపిల్ సంస్థ. ప్రతియేటా కొత్త మాడల్‌ను విడుదల చేస్తున్న సంస్థ..ఆ మరుసటి రోజే ఇతర ఫోన్ల ధరలను భారీగా తగ్గిస్తున్నది. దీంట్లోభాగంగా ఐఫోన్ 15, ఐఫోన్ 14 సిరీస్ మాడళ్ల ధరలను రూ.10 వేల వరకు తగ్గించింది. ఈ నూతన ధరలు వెంటనే అమలులోకి రానున్నట్లు పేర్కొంది. దీంతో ఐఫోన్ 15 మాడల్ ప్రారంభ ధర రూ.69,900కి దిగొచ్చింది. ధరలు తగ్గించకముందు ఇది రూ.79,900గా ఉన్నది.
అలాగే ఐఫోన్ 15 ప్లస్ మాడల్ కూడా రూ.89,900 నుంచి రూ.79,900కి దించింది. వీటితోపాటు ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ మాడళ్లను కూడా రూ.10 వేల వరకు తగ్గించింది. దీంతో ఐఫోన్ 14 ధర రూ.69,900 నుంచి రూ.59,900కి దిగొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న యాపిల్ స్టోర్లతోపాటు భాగస్వామ్య రిటైల్ అవుట్లెట్లలో తగ్గింపు ధరకే ఈ ఫోన్లను విక్రయిస్తున్నారు. ప్రస్తుత పండుగ సీజన్లో ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో ఈ ఫోన్ల ధరలు మరింత తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఎక్సేంజ్ ఆఫర్లతోపాటు బ్యాంక్ డిస్కౌంట్లు కూడా ఉండనున్నాయి.