దుబాయ్: గత నెలలో ముగిసిన ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు విజేతగా నిలిచినా ట్రోఫీని ఇవ్వకుండా అడ్డుకుంటున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ ఐసీసీ కీలక సమావేశానికి డుమ్మా కొట్టనున్నాడు. దుబాయ్‌లో మంగళవారం ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్ ప్రారంభమవగా నాలుగు రోజులు పాటు సమావేశాలు జరుగనున్నాయి.
ట్రోఫీ వివాదంపై ఆగ్రహంగా ఉన్న బీసీసీఐ.. ఈ అంశాన్ని ఐసీసీ మీటింగ్‌లో లేవనెత్తుతామని, ఆ తదనంతర పరిణామాలు ఎదుర్కోవాలని ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో నఖ్వీ ముఖం చాటేయనున్నట్టు సమాచారం. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తరఫున చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుమైర్ ఈ సమావేశానికి హాజరవనున్నట్టు తెలుస్తున్నది.
అయితే పీసీబీతో పాటు ఏసీసీ చీఫ్‌గా ఉన్న నఖ్వీ.. మీటింగ్‌కు రాకుంటే కనీసం ఆన్లైన్లో అయినా హాజరవుతాడా? లేదా? అన్నదానిపైనా సమాచారం లేదని పీసీబీ వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ సిందూర్‌పై అవాకులు చెవాకులు పేలిన నఖ్వీ.. రాజకీయ కారణాల వల్లే ఈ సమావేశానికి దూరంగా ఉండనున్నట్టూ గుసగుసలు వినిపిస్తున్నాయి.