జెడ్డా: సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉమ్రా తీర్థయాత్రకు వెళ్లిన హైదరాబాదీ బృందంలోని 42 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో 24 ఏళ్ల అబ్దుల్ సోహెబ్ మొహమ్మద్(Abdul Shoeb Mohammed) ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదంలో మొత్తం 45 మంది మృతిచెందగా, దాంట్లో 42 మంది హైదరాబాదీలే ఉన్నారు. నవంబర్ 17వ తేదీన తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. మక్కా నుంచి మదీనా వెళ్తున్న సమయంలో .. బస్సు జర్నీ చేస్తున్న అబ్దుల్‌కు ఆ రాత్రి నిద్రపట్టలేదు. దీంతో అతను సీటు మారాడు. డ్రైవర్ పక్కన ఉన్న సీటులో కూర్చున్నాడు. డ్రైవర్‌తో చాటింగ్ చేస్తూ టైం పాస్ చేయాలనుకున్నాడు అబ్దుల్. అయితే వేగంగా దూసుకువస్తున్న ఆయిల్ ట్యాంకర్.. ఉమ్రా యాత్రికులతో వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 42 మంది సజీవ దహనమయ్యారు. ఆ ప్రమాదంలో అబ్దుల్ ఒక్కడే బయటపడ్డారు. బస్సుకు నిప్పు అంటుకోవడానికి కొన్ని సెకన్ల ముందు కిటికీ నుంచి అబ్దుల్ బయటకు దూకేశాడు. ఆ బస్సులో ఉన్న మిగితా ప్రయాణికులకు తప్పించుకున్న సమయం కూడా దొరకలేదు. క్షణాల్లో చెలరేగిన మంటల్లో ఆ యాత్రికులు ఆహుతయ్యారు.

హైదరాబాద్‌లోని అబ్దుల్ సోషెబ్ సమీప బంధువుకు తెల్లవారుజామున 5.30 నిమిషాలకు ఫోన్ కాల్ వచ్చింది. బస్సు ప్రమాదం జరిగిందని, ఆ దుర్ఘటనలో ప్రాణాలతో బయటపడ్డానని, మిగితా ఎవ్వరూ బ్రతకలేదని తమకు సోహెబ్ ఫోన్ చేసినట్లు బంధువు మహమ్మద్ తెహసీన్ తెలిపారు. ఆ ఫోన్ తర్వాత అతన్ని కాంటాక్ట్ కావడం వీలుకాలేదన్నారు. ఆస్పత్రిలో చేరిన సోహెబ్‌ను ఇవాళ కౌన్సులర్ జనరల్ కలిశారు.
హైదరాబాద్‌లోని అసిఫ్‌నగర్ నియోజకవర్గంలో ఉన్న నటరాజ్‌నగర్‌లో సోహెబ్ నివసిస్తున్నాడు. ఓ ప్రైవేటు కంపెనీలో అతను పనిచేస్తున్నాడు. తన పేరెంట్స్‌తో కలిసి అతను ఉమ్రా యాత్రకు వెళ్లాడు. అతని తల్లితండ్రులు ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.