సకల సౌకర్యాలు కల్పిస్తూ విద్యార్థులను ఆకర్షిస్తున్నది ఈ డిగ్రీ కళాశాల. ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన ఈ కళాశాలలో చేరేందుకు విద్యార్థులు ఉత్సాహం చూపుతున్నారు. అంతే ఉత్సాహంతో అధ్యాపకులు విద్యార్థులకు అంకిత భావంతో బోధిస్తున్నారు. ఇతర సర్కారు కళాశాలలకు ఆదర్శంగా నిలుస్తున్నది బోధన్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల.
నిజామాబాద్ జిల్లాలోని బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సకల సౌకర్యాలతో ఆదర్శంగా నిలుస్తున్నది. గతంలో పాత భవనంలో కళాశాల కొనసాగగా రాష్ట్రీయ ఉచ్చతర శిక్షా అభియాన్ పథకంలో భాగంగా మంజూరైన రూ. 2కోట్లతో నూతన భవనం నిర్మించారు. నూతన, పాత భవనాల్లోని మొత్తం 40గదుల్లో అన్ని గ్రూపులకు చెందిన విద్యార్థులకు బోధన కొనసాగుతున్నది. ఉత్తమ అధ్యాపకులు బోధిస్తుండగా, కేవలం విద్యాభ్యాసమే కాకుండా కళాశాల నుంచి బయటికి వెళ్లిన తర్వాత స్వయం ఉపాధి పొందేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు.
‘బీ’ గ్రేడ్ ప్రకటించిన న్యాక్..
బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను గతంలో నేషనల్ అసెస్మెంట్ అకడమిక్ కౌన్సిల్ అధికారుల బృందం సందర్శించి 1.9 స్కోర్‌తో ‘సీ’ గ్రేడ్‌ను ప్రకటించింది. అయితే, ఇటీవలి కాలంలో సదరు బృందం కళాశాలను సందర్శించి అన్ని సౌకర్యాలతోపాటు పలు అంశాలను నిశితంగా తనిఖీ చేసి 2.36 స్కోర్‌తో ‘బీ’ గ్రేడ్‌గా గుర్తింపునిచ్చిది.
పెరుగుతున్న అడ్మిషన్లు..
గతంలో ఈ కళాశాలలోని బీఏ, బీకాం, బీఎస్సీ, తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలో 666 మంది విద్యార్థులు చదువుతుండగా, ఈ సంవత్సరం సుమారు 140 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. దీంతో కళాశాలలో విద్యార్థుల సంఖ్య ఎనిమిది వందలకు చేరింది.
కళాశాల ప్రత్యేకతలు..
బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎక్కడా లేని విధంగా పలు సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా విశ్రాంతి గది, డిజిటల్ క్లాస్‌రూం, ఇంగ్లిష్ ల్యాబ్, జిమ్, కంప్యూటర్ల గది, వర్చువల్ క్లాస్రూంలతోపాటు ఎన్సీసీ కోసం గదిని కేటాయించారు. వివిధ రకాల పాఠ్యపుస్తకాలతోపాటు ఇతరత్రా పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలతో కూడిన లైబ్రరీ ఈ కళాశాలలో ప్రత్యేకం.
వరుసగా రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డులు..
ఈ కళాశాలకు చెందిన అధ్యాపకులు చేస్తున్న కృషి, బోధనకు 2018 నుంచి ఇప్పటివరకు వరుసగా రాష్ట్రస్థాయి అవార్డులు వరించాయి. 2017- 18లో ప్రస్తుత కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. రంగరత్నానికి, 2018-19లో అధ్యాపకురాలు నహీదాబేగం, 2019-20లో కె. భరత్‌రాజ్, 2020-21లో అధ్యాపకురాలు రుబీనా కౌసర్లు రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డులు అందుకున్నారు. రుబీనా కౌసర్‌కు ఆలిండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ వారు ఉత్తమ అధ్యాపకురాలి అవార్డును ప్రదానం చేశారు.
విద్యార్థుల ప్రతిభ..
జిజ్ఞాస ప్రాజెక్ట్ వారు నిర్వహించిన యువతరంగం పోటీల్లో భాగంగా వ్యాసరచన పోటీల్లో బీజడ్సీకి చెందిన శివనందిని రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతిని సాధించింది. 2017-18వ సంవత్సరంలో బీఏ (ఉర్దూమీడియం)కు చెందిన షఫీఖా బేగం నాలుగు సబ్జెక్టుల్లో రాష్ట్రస్థాయి టాపర్‌గా నిలిచింది. యూనివర్సిటీ స్థాయిలో టాపర్‌గా బీఏ (ఉర్దూ మీడియం) విద్యార్థిని హీనా పర్వీన్ నిలిచి ల్యాప్‌టాప్‌ను బహుమతిగా అందుకున్నది. కళాశాలకు చెందిన షారుఖ్ ఖాన్ లాంగ్‌జంప్‌లో రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతిని సాధించాడు. వనజ అనే విద్యార్థిని పలు పోటీల్లో ప్రతిభ చాటింది.
స్వయం శిక్షణ..
కళాశాలలో విద్యార్థులకు బోధనే కాకుండా ఇతర అంశాల్లో సైతం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులు తమ విద్యాభ్యాసం పూర్తి చేసుకొని బయటికి వెళ్లేనాటికి తమకాళ్లపై తాము నిలబడేలా వివిధ అంశాలపై ట్రైనింగ్ ఇస్తున్నారు. కుట్టు శిక్షణ, మెహందీ, ఎంబ్రాయిడరీ, బ్యుటీషియన్ కోర్సుల్లో తర్ఫీదునిస్తున్నారు.
హరితవనంలా కళాశాల ప్రాంగణం..
కళాశాల ప్రాంగణంలో నాటిన సుమారు మూడు వందల మొక్కలు ఏపుగా పెరిగి హరితవనంలా మారింది. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించి, వాటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం జియో ట్యాగింగ్ చేశారు. పాత, కొత్త భవనాల మధ్యలో ఖాళీగా ఉన్న స్థలంలో మొక్కలను నాటారు. దీనికి తోడు కళాశాల బయట ఖాళీ స్థలంలో పట్టణ ప్రకృతి వనం పేరిట మొక్కలను పెంచారు.
అన్ని రకాలుగా బాగుంది..
మా కళాశాలలో విద్యాబోధనతోపాటు అన్ని రకాలుగా చాలా బాగుంది. కంప్యూటర్లను అందుబాటులో ఉంచి విద్యార్థుల్లో నైపు ణ్యం పెంచేందుకు చర్యలు చేపట్టడం సంతోషంగా ఉంది. కళాశాల నుంచి బయటికి వెళ్తే ఖాళీగా ఉండకుండా ఏదో పని చేసుకునేలా తర్ఫీదు ఇస్తున్నారు. కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులకు కృతజ్ఞతలు.
ప్రైవేట్ కళాశాలకు దీటుగా..
మా కళాశాలలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్తోపా టు అత్యుత్తమ బోధన సాగుతున్నది. ఉద యం 10గంటల నుంచి సాయంత్రం వర కు తరగతులతోపాటు అదనంగా కంప్యూటర్ క్లాసులు, లైబ్రరీ సౌకర్యం పోటీ పరీక్షలకు దోహదపడుతున్నది. ప్రిన్సిపాల్, అధ్యాపకులు నిరంతరం పర్యవేక్షిస్తూ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.
విద్యతోపాటు స్వయం ఉపాధిపై శిక్షణ..
బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఇతర కళాశాలలకు ఆదర్శంగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే ఎక్కడా లేని విధంగా సౌకర్యాలు సమకూర్చాం. విద్యాబోధనే కాకుండా స్వయం ఉపాధిలో భాగంగా పలు అంశాలపై శిక్షణ ఇప్పిస్తున్నాం. పోటీ పరీక్షలకు, పీజీలో ప్రవేశానికి ఉచిత శిక్షణ ఇప్పించడంతోపాటు అందుకు కావాల్సిన పుస్తకాలను సైతం లైబ్రరీలో అందుబాటులో ఉంచాం. మా కళాశాలకు న్యాక్ బృందం ‘బీ’ గ్రేడ్ ప్రకటించడం సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ‘ఏ’ గ్రేడ్ సాధనకు కృషి చేస్తాం.