హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యాశాఖలోని సమగ్ర శిక్షా ప్రాజెక్టులో కాంట్రాక్ట్ పద్ధతిలో సేవలందిస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్లకు మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేయాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి సోమవారం లేఖ రాశారు. సీఆర్పీలు కేవలం రూ.19,500 వేతనంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురొంటున్నారని, నిత్యావసరాల ధరలు పెరిగిన నేపథ్యంలో కుటుంబాలను పోషించడం భారంగా మారిందని లేఖలో ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సమస్యలను పరిషరిస్తామని ఇచ్చిన హామీని ఎమ్మెల్సీ రమణ గుర్తుచేశారు. కేజీబీవీ కాంట్రాక్ట్ సిబ్బందితో సమానంగా మహిళా సీఆర్పీలకు 6 నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని, డీఎస్సీ, గురుకుల ఉపాధ్యాయ నియామకాల్లో సీఆర్పీలకు 30 శాతం వెయిటేజీ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. టీఏ, పీఎఫ్, ఇన్సూరెన్స్, నగదు రహిత చికిత్స, విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, అంత్యక్రియల ఖర్చులు తదితర సౌకర్యాలు కల్పించాలని కోరారు.
దివ్యాంగుల వాహనాల సమస్యను పరిషరించండి
రెట్రోఫిట్టెడ్ వాహనాలు రిజిస్ట్రేషన్ కాకపోవడంతో దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఎల్ రమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సోమవారం లేఖ రాశారు. రిజిస్ట్రేషన్ల కోసం దివ్యాంగులు నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. దివ్యాంగుల సంక్షేమ శాఖ, రవాణా శాఖల మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని చెప్పారు.