
హనుమకొండ, డిసెంబర్ 12: తెలంగాణ జాగృతి ఉత్తర అమెరికా అధ్యక్షుడు బండారి శ్రీధర్ మృతి తీరని లోటు అని, ఆయన అకాల మరణం తీవ్రంగా కలిచి వేసిందని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. హనుమకొండ హంటర్‌రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్లో ఆదివారం జరిగిన బండారి శ్రీధర్ సంస్మరణ సభకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీధర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటానని కవిత భరోసా ఇచ్చారు.
అనంతరం ఆమె బాలసముద్రంలోని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లగా చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ దంపతులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు. అక్కడినుంచి బాలసముద్రంలోని స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యాలయాన్ని సందర్శించారు. శిథిలావస్థలో ఉన్న భవనం స్థానంలో కొత్త భవనం నిర్మించాలని స్కౌట్లు, ప్రజాప్రతినిధులు కోరారు. స్పందించిన కవిత ప్రాంతీయ కార్యాలయం విషయాన్ని పరిశీలిస్తానని, కొత్త భవన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.