ఉప్పల్, నవంబర్ 29: దళిత వ్యతిరేక పార్టీ అయిన బీజేపీ ఎస్సీ వర్గీకరణపై దాటవేసే ధోరణి ప్రదర్శిస్తున్నదని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మండిపడ్డారు. దళిత సంఘాలు సంఘటితమై నాయకత్వం కోసం కాకుండా జాతి ప్రయోజనాల కోసం పోరాడాలని సూచించారు. సోమవారం హబ్సిగూడలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడేండ్లకాలంలో కేంద్రంలోని మోదీ సర్కారు దళితుల కోసం ఒక్క పథకం కూడా తీసుకురాలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మాదిగల ఆత్మగౌరవం కోసం సహకారం అందిస్తామని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చెప్పారు. జాతి లక్ష్యం కోసం పోరాటం చేస్తామని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. న్యాయమైన డిమాండ్‌కు టీఆర్ఎస్పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ భరోసా ఇచ్చారు. డిసెంబర్ 13న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించి, ఎస్సీ వర్గీకరణపై ఎమ్మార్పీస్ సత్తా చాటుతామని వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. మాదిగల ఆత్మగౌరవం కోసం అన్ని సంఘాలతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య చెప్పారు. సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ర్టాల ఎమ్మార్పీఎస్ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.