కవాడిగూడ, సెప్టెంబర్ 13: కేబుల్ ఆపరేటర్లు సమాజాభివృద్ధితో పాటు వినోదాన్ని అందించేందుకు ఎంతో కృషి చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. కేబుల్ కట్టింగ్ నిలిపివేయాలని, కేబుల్ టీవీ, ఇంటర్నెట్ ఆపరేటర్స్ జీవితాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఫెడరేషన్ ఆఫ్ ఏరియల్ కేబుల్ ఆపరేటర్స్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద శనివారం మహాధర్నా నిర్వహించారు.
ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ హాజరై మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ కనీసం వారం పదిరోజులైనా కేబుల్ ఆపరేటర్లకు సమయం ఇవ్వకుండా కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.
పేదల ఓట్లతో అధికారంలోకి వచ్చి.. కేబుల్ ఆపరేటర్ల జీవితాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పతనం తప్పదన్నారు. దాదాపు ఐదారు లక్షల మంది కేబుల్ పరిశ్రమతో జీవనం పొందుతున్నారని, ప్రభుత్వ చర్యలతో వాటిపై ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి బయటపడకుండా ఉండేందుకే ఉద్దేశపూర్వకంగా కేబుల్, ఇంటర్నెట్, ప్రసారాలను నిలిపివేసేలా చర్యలకు పూనుకుందని ఆరోపించారు.
జీవో ఎమ్మెస్ 2 ఫిబ్రవరి 19,2021 న విడుదలైన జీవోను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడంలేదని నిలదీశారు. జీవో అమలయ్యేంత వరకూ పోరాటం కొనసాగుతుందని, కేబుల్ ఆపరేటర్ల ఏ పోరాటానికైనా బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఈ మహాధర్నాలో అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, అధ్యక్షుడు సతీశ్‌బాబు, ఉపాధ్యక్షులు అబ్దుల్ సలాం, కరుణాకర్, ప్రధాన కార్యదర్శి అరవింద్, షాబుద్దీన్, శివాజీ, సంజయ్, కృష్ణ, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.