మంచిర్యాల, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంచిర్యాల నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్‌లో చీలిక ఏర్పడింది. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు (పీఎస్ఆర్), అసమ్మతి నేత జగన్మోహన్రావు (జగన్) రెండు వర్గాలుగా చీలిపోయారు. మంచిర్యాలలో వెంకటస్వామి విగ్రహావిష్కరణ వ్యవహారం మరువకముందే.. మంచిర్యాలకు చెందిన 8 మంది కార్పొరేటర్లు, లక్షెట్టిపేటకు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు, దండేపల్లికి చెందిన ఇద్దరు సర్పంచ్‌లు, ఇద్దరు ఉపసర్పంచ్లు, మాజీ సర్పంచ్ శుక్రవారం జగన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మంత్రి వివేక్, ఎంపీ వంశీని కలువడంతో వర్గవిభేదాలను బట్టబయలు చేశాయి.
లక్షెట్టిపేటలో కాంగ్రెస్ కౌన్సిలర్లు 9 మంది ఉంటే.. ముగ్గురు జగన్ వర్గీయులుగా తెరపైకి వచ్చారు. మంచిర్యాలలో 8 మంది కార్పొరేటర్లు ఆయన పక్కన చేరడం పార్టీని కుదిపేస్తున్నది. జగన్మోహన్రావుతో పలువురు నేతలు త్వరలోనే అంతా ఆయన పక్షంలో చేరుతారని వారి వర్గం చెప్పుకొంటుంటే.. లేదు ఎమ్మెల్యే వెంటే ఉన్నారంటూ పీఎస్ఆర్ వర్గం చెప్తున్నది. మొన్నటికి మొన్న 53 మంది కార్పొరేటర్లు పీఎస్ఆర్ ఇంట్లో ప్రెస్‌మీట్ పెట్టి ఎమ్మెల్యే వెంటే ఉంటామని ప్రకటించి.. తీరా వారిలో 8 మంది జగన్‌తో అంటకాగడం పీఎస్ఆర్ వర్గానికి మింగుడుపడటం లేదు.