సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రిలో పూర్తి స్థాయి వైద్యులు, మౌలిక వసతులు లేక పోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వైద్యులను నియమించడంతో పాటు సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. వైద్యులు లేకపోవడంతో డీఆర్పీ ప్రోగ్రామ్ కింద పీజీ విద్యార్థులు పేషేంట్లకు బేసిక్ మందులు రాసి పంపుతున్నారు. రోగులను ఉస్మానియా, గాంధీలకు రెఫర్ చేస్తున్నట్టు రోగులు తెలుపుతున్నారు.
నీటి సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ పోస్టు మాత్రమే రెగ్యులర్ కాగా.. మిగతా వారిని తాత్కాలిక పద్ధతిలో నియమించారు. కొంత మంది వైద్యులను ఉస్మానియా, గాంధీ నుంచి తాత్కాలికంగా డిప్యుటేషన్‌పై తీసుకొచ్చారని.. ప్రత్యేకంగా సాంక్షన్డ్ పోస్టులు ఎందుకు ఏర్పాటు చేయలేదని వైద్యులు ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : ‘ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, ఎల్బీనగర్, అల్వాల్ టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం వేగంగా చేపట్టి ప్రతి ఆరు నెలలకొకటి చొప్పున అందుబాటులోకి తెస్తాం. 2027 డిసెంబర్ లోపు అన్నింటిని పూర్తి చేస్తాం..వీటి ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 10వేల పడకలు సమకూరుతాయి..కార్పొరేటుకు దీటుగా ఈ ఆసుపత్రులను తీర్చిదిద్దుతాం.’ ఇది సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య లు ఓ వైపు నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను ఆరు నెలలకొకటి చొప్పున అందుబాటులోకి తేస్తామని ముఖ్యమంత్రి చెబుతుండగా..
మరోవైపు తానే స్వయంగా ప్రారంభించిన సనత్‌నగర్ టిమ్స్‌లో పూర్తి స్థాయి వైద్యులు, మౌలిక వసతులు లేక పోవడం వైద్య రంగంపై కాంగ్రెస్ సర్కార్ చిత్తశుద్ధి లేమికి అద్దం పడుతున్నది. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు ముందు సనత్‌నగర్ టిమ్స్‌ను ప్రారంభించి వెళ్తా.. అనడంతో పూర్తి స్థాయిలో ఆసుపత్రిలో వసతులు లేకున్నా ఆఘమేఘాల మీద ప్రారంభోత్సవానికి వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. ఇక బుధవారం బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు టిమ్స్‌ను సందర్శించేందుకు వెళ్లనుండగా ఉలిక్కిపడిన సర్కారు ఆసుపత్రిలోని డొల్లతనం బయటపడుతుందని హౌస్ అరెస్ట్ చేసి పర్యటనను అడ్డుకుంది.

ప్రారంభానికి ముందే వైద్యులను నియమించడంతో పాటు మౌలిక వసతులు కల్పించాల్సిన ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించింది. ఇక సనత్‌నగర్ టిమ్స్‌లో డైరెక్టర్ పోస్టు మాత్రమే రెగ్యులర్ కాగా.. మిగతా వారంతా తాత్కాలిక పద్ధతిలో నియమించింది. కొంత మంది వైద్యులను ఉస్మానియా, గాంధీ నుంచి తాత్కాలికంగా డిప్యుటేషన్ తీసుకొచ్చారు. ఆయా ఆసుపత్రుల మీద భారం పడటంతో వారిని తిరిగి పంపించేసినట్టు తెలిసింది. ఇక సర్కారు గత్యంతరం లేక డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రొగ్రామ్(డీఆర్పీ) కింద జిల్లాల్లో వైద్య సేవలు అందించాల్సిన పీజీ వైద్య విద్యార్థులను టిమ్స్‌లో వైద్య సేవలకు వాడుకుంటున్నట్టు తెలిసింది.
జిల్లా స్థాయిలో హెల్త్ సిస్టమ్, జిల్లా ఆసుపత్రుల ప్రత్యక్ష అనుభవానికి పీజీ విద్యార్థులకు ఈ ప్రొగ్రామ్‌ను జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) 2012 బ్యాచ్ నుంచి ప్రవేశపెట్టింది. జిల్లా ఆసుపత్రులతో పాటు పెరిఫెరల్ హెల్త్ సిస్టమ్‌ను బలోపేతం చేయడం, జిల్లాల్లో నేషనల్ హెల్త్ ప్రొగ్రామ్ ఎలా అమలు అవుతుందో తెలుసుకోవడం ఈ ప్రొగ్రామ్ ఉద్దేశం. అయితే రాష్ట్రంలో ఎన్ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా పీజీ వైద్యుల డీఆర్పీ ప్రొగ్రామ్‌ను సర్కారు తప్పుదారి పట్టిస్తున్నదని వైద్య వర్గాలు మండిపడుతున్నాయి. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అయిన టిమ్స్‌కు ప్రత్యేకంగా సాంక్షన్డ్ పోస్టులు ఎందుకు ఏర్పాటు చేయలేదని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. టిమ్స్‌కు వెంటనే పోస్టులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
టిమ్స్‌లో పూర్తి స్థాయిలో వైద్యులు లేకపోవడంతో డీఆర్పీ ప్రొగ్రామ్ కింద పీజీ విద్యార్థులు పేషేంట్లకు బేసిక్ మందులు రాసి పంపుతున్నట్టు తెలిసింది. పరిస్థితి తీవ్రంగా ఉంటే రోగులను ఉస్మానియా, గాంధీలకు రెఫర్ చేస్తున్నట్టు సమాచారం. మరో వైపు ఇంతటి ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రికి నీటి సౌకర్యం లేక పోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొంత మంది చేసేదేమీ లేక నీటిని బయట నుంచి తెచ్చుకుంటున్నట్టు తెలిసింది.
ఓ వైపు ఆసుపత్రిలో ఆపరేషన్లు చేస్తారని అధికారులు చెబుతున్నా.. నీటి వసతి లేకపోవడంతో స్టెరిలైజేషన్ ప్రక్రియపై నీలి నీడలు కమ్ముకున్నాయి. మరోవైపు ఈ నెల 21 నుంచి ఐపీ సేవలు, ఆపరేషన్లు ప్రారంభిస్తున్నట్టు వైద్యారోగ్య శాఖ ప్రకటించగా.. టిమ్స్‌లో కనీసం స్ట్రెచర్లు, ఐసీయూ సెటప్ లేదని సమాచారం. వెంటిలేటర్లు ఉన్నా ఇప్పటికీ ఫిక్స్ చేయలేదని తెలుస్తున్నది. దీంతో పాటు పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్ లేదని తెలిసింది. ఉన్న ఎక్విప్మెంట్ సైతం ఇన్స్టాల్ చేయలేదని సమాచారం. ర్యాంప్ లేకపోవడంతో పేషెంట్లకు ఇబ్బందులకు తప్పడం లేదని తెలిసింది.