కుత్బుల్లాపూర్, డిసెంబర్10: నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్యల్లేకుండా రోడ్లను నిర్మించేలా పక్కాగా ప్రణాళికలు రూపొందించాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, అధికారులకు సూచించారు. శుక్రవారం పేట్ బషీరాబాద్ క్యాంపు కార్యాలయంలో హెచ్ఆర్డీసీఎల్ అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకు పెరిగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించడంతో పాటు భవిష్యత్‌లో ఇబ్బందులు కలుగకుండా చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గాన్ని జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్ సమస్యను అధిగమించేలా లింక్ రోడ్లను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
దీనిలో భాగంగా ప్రగతినగర్ నుంచి మహదేవపురం వెటర్నరీ దవాఖాన, ఎల్లమ్మబండ బాచుపల్లి వికాస్ స్కూల్ నుంచి గోకరాజు రంగరాజు కాలేజీ, నిజాంపేట వీఎన్ఆర్ కళాశాల నుంచి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, బాచుపల్లి నుంచి వయా ఆర్జీకే డబుల్ బెడ్రూం, సుభాష్‌నగర్ రామ్రెడ్డినగర్ నుంచి ఫాక్స్‌సాగర్ మీదిగా ఎన్‌హెచ్-44 కుత్బుల్లాపూర్ విలేజ్ రోడ్డు నుంచి పైపులైన్ రోడ్డు వయా గోదావరి హోమ్స్, సేయంట్ ఆంతోనీస్ హైస్కూల్, వెన్నెలగడ్డ చెరువు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందన్నారు.
ఈ సమస్యను అధిగమించేలా లింక్‌రోడ్లను అభివృద్ధి చేయాలని అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. దీంతో పాటు మిస్సింగ్ లింక్ ప్రాజెక్ట్ ఫేస్-2లో భాగంగా బాచుపల్లి నుంచి నిజాంపేట్ వికాస్ స్కూల్ 1.7 కిలోమీటర్లు, బాచుపల్లి నుంచి నిజాంపేట్ రోడ్డు 1.6 కిలోమీటర్ల ఏర్పాటుకు మంజూరైన రూ.36.3 కోట్లతో పనులు వేగంగా ప్రారంభించి, సకాలంలో పూర్తి చేసేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎస్ఈ సర్ధార్‌సింగ్, ఈఈ రాయ్‌మల్ పాల్గొన్నారు.
జీడిమెట్ల డివిజన్లోని గాయత్రీనగర్ పార్క్‌లో ఏర్పాటు చేస్తున్న సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)ను మరో చోటుకు మార్చాలని కాలనీవాసులు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్‌కు వినతి పత్రం అందజేశారు. పార్కులో ఎస్టీపీ నిర్మిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని కాలనీవాసులు తెలిపారు. కాలనీలో ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాలనీ సలహాదారుడు ప్రవీణ్, అధ్యక్షుడు మహేందర్‌సింగ్, ఉపాధ్యక్షులు అచ్యుత వర్ధన్, కనకయ్య, మహిళా అధ్యక్షురాలు వైలెట్ జర్జ్, కార్యదర్శి సంధ్య, శ్రీనివాస్‌రెడ్డి, రమేశ్, భూపాల్, వీరేశ్, సాయిబాబా, సత్యనారాయణ, రఘుపతిరెడ్డి, కాలె నగేశ్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలి
జీడిమెట్ల, డిసెంబర్ 10: రంగారెడ్డినగర్ డివిజన్ ఆదర్శనగర్ కాలనీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను ఆదర్శనగర్ సంక్షేమ సంఘం సభ్యులు కోరారు. శుక్రవారం ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. తమ కాలనీలో భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్లు, విద్యుత్ స్తంభాలు, పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్థంగా ఉన్నదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాలనీలు, బస్తీల అభివృద్ధికి తనవంతు సహకారం ఉంటుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఏరువ శంకరయ్య, సభ్యులు దుర్గా, నాంచారమ్మ పాల్గొన్నారు.