అందరికీ అందుబాటులో ఉంటూ సంక్షేమం దిశగా పరుగులు అభివృద్ధిలో ఆదర్శంగా అంబర్‌పేట.. గెలిపించిన ప్రజలకు సేవ చేస్తున్న
సీఎంకు రుణపడి ఉంటా: ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా నడుస్తూ తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నారు. అంబర్‌పేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ దూసుకెళ్తున్నారు. ఒకవైపు అభివృద్ధి పనులు.. మరోవైపు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన మూడేండ్ల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. బస్తీలు, కాలనీల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నారు.
అభివృద్ధి, సంక్షేమం ఒక ఎత్తయితే.. సేవా కార్యక్రమాలు మరో ఎత్తు. కరోనా కష్టకాలంలో ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించడమే కాకుండా పేదలకు ఆర్థిక సహాయం చేశారు. కరోనా సెకండ్ వేవ్‌లో నెల రోజుల పాటు అంబర్‌పేట వ్యాప్తంగా ప్రతి రోజూ 300 మంది పేదలకు పౌష్టికాహారం అందించారు. అంబర్‌పేట సీపీఎల్ పాఠశాలలో కొవిడ్ రోగులకు ప్రత్యేకంగా కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేయించారు. ఉచితంగా ఆక్సిజన్ అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఫీజులు చెల్లించలేని పేద విద్యార్థులకు స్కూళ్లు, కళాశాలల్లో రాయితీ ఇప్పించడమే కాకుండా తాను సొంతంగా ఫీజులు చెల్లిస్తుంటారు. నియోజకవర్గంలోని ఐదారు దేవాలయాల్లో పని చేస్తున్న పూజారులకు నెలకు రూ.6 వేల చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నారు. సొంతంగా రెండుగుళ్లను కూడానిర్మించారు. నియోజకవర్గంలో ఎవరైనా పేదలు చనిపోతే వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. శ్మశానవాటికలో ఎక్క పైసా ఖర్చు లేకుండా అంత్యక్రియలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.
వర్కింగ్ అడ్వొకేట్‌గా పని చేస్తున్న నన్ను సీఎం కేసీఆర్ పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిపించారు. సీఎం నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. గెలిపించిన ప్రజలకు సేవ చేస్తున్నాను. అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాను.
గత 15 ఏండ్లలో లేని అభివృద్ధి నియోజకవర్గంలో ఈ మూడేండ్లలో జరిగింది. సీసీ, బీటీ రోడ్లతో పాటు వీడీసీసీ రోడ్డు నిర్మాణానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. సుమారు ఏడు కోట్లతో మంచినీటి, డ్రైనేజీ పైపులైన్ల నిర్మాణం జరిగింది. వీధి దీపాలు, పారిశుధ్య నిర్వహణ మెరుగుకు చర్యలు తీసుకున్నారు. వరదనీటి పైపులైన్ పనులకు కూడా కోట్లు మంజూరయ్యాయి. పార్కుల సుందరీకరణ, జంక్షన్ల అభివృద్ధి వంటివి చేపట్టారు. రూ.147 కోట్లతో అన్ని రంగాలను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. ఇందులో సగం నిధులు మంజూరయ్యాయి. పనులు త్వరలోనే మొదలు కానున్నాయి. వీటితో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నారు. ప్రధానంగా ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో పాటు సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ మంజూరు చేయిస్తున్నారు.