నర్సంపేట, డిసెంబర్16 : నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రాజుపేట గ్రామంలో మంగళవారం ఎన్నికల ప్రచారాన్ని చేశారు. వివరాల్లోకి వెళితే.. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మంగళవారం ఉదయం నాలుగు వాహనాలల్లో నర్సంపేట నుంచి రాజుపేట గ్రామ పంచాయతీ పరిధిలోని గార్లగడ్డతండాకు చేరుకున్నాడు. అక్కడ కాంగ్రెస్ పార్టీ 5వ వార్డు సభ్యుడు బోడ సాంబయ్య ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థితోపాటు అన్ని వార్డులను కాంగ్రెస్ గెలిపించుకోవాలని కోరారు.
అక్కడి నుంచి ముత్యాలమ్మతండాకు చేరుకున్న ఎమ్మెల్యే అక్కడ కూడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి సభ నిర్వహించారు. గత సోమవారం సాయంత్రం 5 గంటలకే మూడో విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. కానీ, అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దొంతికి అవేమి పట్టనట్టుగా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించడం గమనార్హం. ఈ విషయమై స్థానిక బీఆర్ఎస్ మండల నాయకులు రెవెన్యూ, పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంపై పలువురు బాహటంగానే విమర్శిస్తున్నారు.